Non-Erotic ఎంజాయ్ మేరిటల్ బ్లిస్

Member
227
229
18
ఎంజాయ్ మేరిటల్ బ్లిస్


చిక్కగా అల్లుకున్న పచ్చని పందిరిమీద, లేత రంగుల కలయికతో తీగలుగా సాగే రెమ్మలమీద ఉయ్యాలలూగుతున్న ఆ చిలుక, గోరింకల సాన్నిహిత్యాన్ని చూస్తున్న అలకనంద ఊహలు భువిని వీడి దివిని తాకుతుండగా సన్నగా కోకిల కూత కూసింది ఆమె మొబైలు.

స్వర్గానికి చేరువలో వున్నట్టున్న ఆమె ఒక్కసారి ఈ భూతలానికి వచ్చిపడింది. కిటికీలోంచి చూస్తున్న అందమైన దృశ్యాన్నుంచి దృష్టిని మంచం మీద పడున్న మొబైల్ వైపు సారించింది. అక్కడ వినీత మొహం కనపడింది. మొబైల్ చేతిలోకి తీసుకుని “యేమిటే..” అంది విసుగు కంఠంలో వినపడకుండా జాగ్రత్తపడుతూ..

“ఏం చేస్తున్నావే.. బిజీనా యేర్పాట్లతో..” అట్నుంచి వినీత ప్రశ్న వినగానే “ ఇంతకీ తమరెందుకు చేసినట్టో..” అనడిగింది.

“అహా.. యేం లేదు. ఇప్పుడే ఒక వెబ్ సైట్ చూసాను. అందులో పెళ్ళికి యేమేమి కావాలో, యెక్కడెక్కడ దొరుకుతాయో అన్నీ చాలా బాగున్నాయి. అందులోనూ కస్టమ్ డిజైనర్స్ ట. నువ్వసలే ఊహల్లో విహరిస్తుంటావు. నీ ఊహలను వాళ్ళేమైనా అందుకోగలరేమోనని చెప్తున్నాను. ఇప్పుడే ఆ వెబ్ సైట్ లింక్ మొబైల్ లో మెసేజ్ పెడతాను. చూసుకో” అంటూ ఫోన్ పెట్టేసింది.

కాసేపట్లో ఆ లింక్ అల మొబైల్ లోకి వచ్చేసింది. దానిని క్లిక్ చేద్దామనుకుంటుంటే రూమ్ తలుపు తోసుకుంటూ వచ్చింది అల మేనత్త సుగుణ. రాగానే చేతులు జాచి అలను దగ్గరికి తీసుకుంటూ “ కంగ్రాట్యులేషన్స్ .. అన్నయ్య చెప్పగానే యెంత సంతోషంగా అనిపించిందో.. అవునూ.. ఇద్దరూ ప్రేమించుకున్నార్ట కదా…. పైకి యేమీ తెలీని అమాయకురాలిలా కనిపిస్తావు కానీ గడుసుదానివే.” అంది నవ్వుతూ.

చిన్నగా నవ్వుతూ “ఎప్పుడొచ్చావు అత్తయ్యా..” అని అడిగింది అల. “ఇప్పుడే.. నిన్నరాత్రి అన్నయ్య ఫోన్ చేసి చెప్పగానే ఆగలేక రాత్రే బస్ ఎక్కి వచ్చేసాను. ఇంతకీ నీ మన్మథుణ్ణి ఎప్పుడు చూపిస్తావ్..” కొంటెగా అడిగింది సుగుణ. “నీకన్నానా అత్తయ్యా.. అలాగే..ఇప్పుడు టైమ్ అయిపోతోంది.. సాయంత్రం మాట్లాడుకుందామేం” అంటూ నెమ్మదిగా మేనత్తని తప్పించుకుంది అల.

జలపాతంలా దూకుతున్న ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టున్న మేనత్త రాక అల కి యెందుకో గొంతు దిగలేదు. అత్తని చూస్తుంటే యేమిటో అసంపూర్ణచిత్రాన్ని చూసినట్టుంటుంది. సుగుణ నవ్వుతుంది కానీ అ నవ్వు తెచ్చిపెట్టుకున్నట్టుంటుంది తప్పితే సంతోషం కనిపించదు. అందరితోనూ కలిసే వుంటుంది కానీ యెప్పుడూ యెక్కడో ఆలోచిస్తున్నట్టుంటుంది. సుగుణ భర్తని వదిలి విడిగా వుంటోందన్న విషయం మాత్రం అలకు తెలుసు కానీ అలా యెందుకుంటూందో మాత్రం తెలీలేదు. ఆలోచిస్తూనే ఆఫీస్ కి వెళ్ళి రొటీన్ లో పడిపోయింది.

గంటగంటకీ విజయ్ నుంచి వస్తున్న తియ్యటి మెసేజ్ లని ఆస్వాదిస్తూ, తను కూడా అందుకు తగ్గట్టుగానే జవాబులిస్తూ ఆ మధ్యలోనే వినీత పంపిన వెబ్ సైట్ లో లాగిన్ అయిన అల ఆ సైట్ చూసి ఆశ్చర్యపోయింది. అందులో ఎంగేజ్ మెంట్ దగ్గర్నుంచీ, పెళ్ళయ్యి, దంపతులు హనీమూన్ వెళ్ళేవరకూ అన్నిరకాల సందర్భాలకూ యెన్నెన్ని రకాల ఆప్షన్లు వున్నాయో చూసి అబ్బురపడింది. ప్రతిదానికీ బడ్జెట్ ని బట్టి యేవేవి యెక్కడెక్కడ దొరుకుతాయో, కొనుక్కునేవారి అభీష్టాన్ననుసరించి యే విధంగా తయారుచేసి యిస్తారో అన్నీ అడ్రసులు, ఫోన్ నంబర్లతో సహా వివరంగా వున్నాయి. వరసగా ఒక్కొక్క శీర్షికనీ చూసుకుంటూ వెడుతున్న అల ఒక పేజీ చూస్తుండగా ఆ పేజీలో ఒక మూలనుంచి ఒక నక్షత్రం లాంటిది ముందుకి దూసుకువచ్చినట్టు వచ్చింది. ఆ నక్షత్రంలో “ఎంజాయ్ మేరిటల్ బ్లిస్” అంటూ ఒక స్లోగన్, దానికింద టాగ్ లైన్ లాగ “మీ కాపురం కలకలలాడాలంటే..కలవండి.” అని కనిపించింది. దాని పక్కనే ఫోన్ నంబర్ కూడా వుంది.

అంటే పెళ్ళికి ముందే కౌన్సిలింగా అనుకుంటూ యింకా ముందుకు వెళ్ళింది.

తర్వాత పేజీలో మళ్ళీ “ఎంజాయ్ మేరిటల్ బ్లిస్”

మీ సంసారం శృతిబధ్ధమైన సుస్వరాలు పలకాలంటే మీ వీణతీగలు విడిగానే వుండాలి. అందుకోసం వివాహానికి ముందుగానే కలవండి. అంటూ అదే ఫోన్ నంబర్.

అలా అల పేజీలు మారుస్తున్నప్పుడల్లా ఒక్కొక్క వాక్యం కనిపించింది.

“ప్రేమ మీద విశ్వాసం వున్నవాళ్ళు ఆ ప్రేమపక్షి రెక్కలకింద చురకత్తులుండి మిమ్మల్ని కోత పెడుతున్నా భరించాల్సిందే..”

ప్రేమపెళ్ళి చేసుకుంటున్నారా.. అయితే మీరు పెళ్ళికి ముందే కలవండి “ఎంజాయ్ మేరిటల్ బ్లిస్” అనే స్లోగన్. దానికి టాగ్ లైన్ “ప్రేమలో మీరిద్దరూ మునిగి తేలాలంటే..కలవండి” అంటూ. అక్కడ కూడా అదే ఫోన్ నంబర్.

మరో పేజీలో కూడా అలాంటి వాక్యమే మూలనుంచి దూసుకువచ్చింది.

“కోవెల స్తంభాలు ఒక్కటిగా కలిసివుండవు. దూరంగానే వుంటాయి. అప్పుడే ఆ కోవెలలో దేవుణ్ణి పెట్టి పూజించగలం”అనే వాక్యంతో “ఎంజాయ్ మేరిటల్ బ్లిస్ కి “ఏకత్వంలోని భిన్నత్వాన్ని తెలుసుకోండి..” టాగ్ లైన్ తో అదే ఫోన్ నంబర్.

యిదేమిటి ఈ ప్రకటన? కలిసివుండాలంటే విడిగా వుంటేనే కుదురుతుంది అన్నట్టుంది అనుకుంటూ అసలు సంగతేమిటో తెలుస్తుంది కదా అని ఆ నంబర్ కు ఫోన్ చేసింది.

ఫోన్ కలవగానే “ఎంజాయ్ మేరిటల్ బ్లిస్”నుంచి మాట్లాడుతున్నాం…మీకు పెళ్ళి కుదిరిందా.. అయిందా?” అంటూ సన్నని స్వరంతో వీణమీటినట్టున్న ఆడగొంతు వినిపించింది.

“మీరు యెవరండీ? మీ ప్రకటన నాకు అర్ధంకాలేదు అందుకనే చేసాను. కలిసి బతకాలంటే విడిగా వుండాలంటారేమిటి?” అనడిగింది.

వెంటనే అట్నుంచి “మీరు యే ఊళ్ళో వుంటారు?” అన్న ప్రశ్న వచ్చింది. తెలియనివారికి తన గురించి వివరాలు యివ్వడానికి యిష్టపడని అల “ముందు మీరు యే ఊళ్ళో వుంటారో చెప్పండి. మీ ప్రకటనలో వున్నదాని అర్ధమేమిటో చెప్పండి.” అంది.

అవతల్నించి చిన్నగా నవ్విన శబ్దం వినిపించింది. “నాపేరు సుస్వర. నేను హైద్రాబాదులో వుంటాను. మారుతున్నకాలాన్ని బట్టి మనుషుల మనస్తత్వాలు మారుతున్నాయి. దానిని బట్టి విలువలు, సాంప్రదాయాలు మారుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా చెప్పబడిన భారతీయకుటుంబ వ్యవస్థ ఈ మధ్య బీటలు వారుతోంది. మనుషులు మమకారాలకన్న స్వార్ధానికే పెద్దపీట వేస్తున్నారు. దానికి నిదర్శనం యిప్పుడు యెక్కువగా నమోదవుతున్న విడాకుల కేసులు, దానితోపాటు వివాహం మీద నమ్మకం పోయి సహజీవనాన్ని ఆశ్రయిస్తున్న యువత ధోరణులు. అవి మంచికా చెడ్డకా అని నేను చెప్పను. కాలంతోపాటు కొన్ని మార్పులు తప్పవు. కానీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. వివాహమంటూ చేసుకున్నాక ఒక్క ప్రాణం మీదకి వస్తే తప్పితే జీవితభాగస్వామిని విడాకులతో దూరం చేసుకోనక్కరలేదని.”

“అలాంటి మేరేజ్ కౌన్సిలింగ్ సెంటర్లు చాలావున్నాయి. విడిపోవాలనుకున్న భార్యాభర్తలకు యిలాంటి కౌన్సిలింగ్ సెంటర్ల అవసరం కానీ హాయిగా పెళ్ళి చేసుకుని, సుఖంగా, సంతోషంగా వుండాలనుకుంటున్నవాళ్లకి మీతో పనేవిటండీ?”

“అదేనమ్మా చెప్పబోతున్నాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని మెడికల్ ఫీల్డ్ లో ఒకమాట చెప్తారుకదా.. అలాగే యిదికూడా. యిదివరకు రోజుల్లో అంటే రెండుతరాల క్రితం ఈ పనిని అమ్మమ్మలు, నాన్నమ్మలు చేసేవారు. అంతేకాక ఆడపిల్లలకీ, మగపిల్లలకీ కూడా వాళ్ళు పెరుగుతున్న వాతావరణంలోనే భార్యాభర్తలు యెలా కలిసివుండాలో అర్ధమైపోయేది. కానీ క్రితం తరం నుంచీ అలాంటి ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. ఒకరూ, యిద్దరూ పిల్లలవడంతో పిల్లలు పెరుగుతున్నప్పుడు వారు కోరినవన్నీ సమకూర్చే తల్లితండ్రులుండడం వల్ల పిల్లలలో దేనినైనా నలుగురితో కలిసి పంచుకుందామనే భావన తగ్గిపోయింది. తనకి కావలసినట్టు వుండడం అలవాటయిపోయి జీవితాన్ని పంచుకుందుకు వచ్చిన జీవితభాగస్వామితో సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు. చాలా చిన్న చిన్న విషయాల మీద మొదలైన గొడవలు అహాన్ని వదలలేక ఆ దంపతులు విడిపోయేదాకా వెడుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సంఖ్య యింకా తక్కువగానే వున్నా మొదట్లోనే దీనికి మందు వేయొచ్చనే ఉద్దేశ్యంతో నేను యిది మొదలుపెట్టాను.”

“అంటే.. మీరేం చెప్తారు? ఒకరిమాట మరొకరు వినాలని చెప్తారు అంతేకదా. అయినా పెళ్ళి చేసుకునేముందు మేం దెబ్బలాడుకోకుండా వుండాలంటే యేం చెయ్యాలీ అనడుగుతారా యెవరైనా” అంది తేలిగ్గా అల.

“అదేనమ్మా సమస్య. పెళ్ళి చేసుకునేముందు అంతా ఒక రంగులకలే. యిద్దరూ ఊహల్లోనే జీవిస్తారు. తర్వాతే ఒక్కొక్కటీ ఆ కలల్లాగే విడిపోయి సత్యాలు బయటపడతాయి. అసలు పెళ్ళంటే మీరు యేమనుకుంటున్నారు..అది ముందు చెప్పండి..” అంది సుస్వర.

“చూడండీ.. కలలు కనడానికి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న మేవిద్దరం చిన్నపిల్లలమేవీ కాదు. బతకడానికి డబ్బు యెంత అవసరమో, దానికోసం యెంత కష్టపడాలో మా యిద్దరికీ తెలుసు. యిద్దరం సంపాదించుకుంటున్నాం. మేం అటు కాని ఇటు కాని యెవరినీ పెట్టి పోషించక్కర్లేదు. హాయిగా మా ఇంట్లో మేము పిల్లాపాపలతో మాకు ఇష్టం వచ్చినట్టు వుంటాము.” గట్టిగా చెప్పింది అల.

అటునుంచి సుస్వర నవ్వు వినిపించింది. “మిమ్మల్ని మీరు యెంత అందంగా మభ్యపెట్టుకుంటున్నారూ?”

ఆ మాటలూ, నవ్వూ విన్న అలకి కోపం వచ్చింది. “అంటే ..”

“అంటే.. ఈ మధ్య విడిపోవాలనుకుంటున్న చాలామంది కూడా ఆర్ధికంగా పై అంతస్థులో వున్నవారే. కలిసివుండడానికీ, విడిపోవాలనుకోడానికి కేవలం డబ్బొక్కటే కారణం కాదు. చూడండీ.. నేను హైద్రాబాదులోనే వుంటాను. మీరు కూడా యిక్కడే వుంటే ఒకసారి వచ్చి స్వయంగా కలిస్తే ముఖాముఖీ అన్నీ మాట్లాడుకోవచ్చును. వేరే యెక్కడైనా వుంటే హైద్రాబాదు వచ్చినప్పుడు కలవండి. అది కూడా మీరు పెళ్ళి చేసుకోవాలనుకుంటుంటేనూ, ఆ పెళ్ళి కొన్నాళ్ల తర్వాత అభిప్రాయభేదాలతో విడిపోకుండా నాలుగు కాలాలపాటు ఆనందంగా వుండాలంటేనూ మీ మనస్సులో అనిపిస్తేనే రండి. వచ్చేముందు ఒక్కసారి ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకోండి.”

అలకి చిరాకులాంటిది వచ్చింది. హూ.. రోజులెలా మారిపోయాయీ.. మాటలు చెప్పి మూటలు కట్టుకునే యిలాంటి సెంటర్ల వల్ల యెంతమంది అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారో అనుకుంటూ “అలాగేనండీ.. నేనూ హైద్రాబాదులోనే వుంటాను. అపాయింట్ మెంట్ తీసుకుని మిమ్మల్ని కలుస్తాను. యింతకీ మీ కన్సల్టేషన్ ఫీ యెంతో చెపితే..” అంటూ ఫోన్ లో మాట్లాడడం సగం లో ఆపేసింది.

అటునుంచి అదే వీణ మీటినట్లున్న సన్నని నవ్వు. “ఫీ యేమీ లేదండీ. మీకు టైమ్ వున్నప్పుడు ఫోన్ చెయ్యండి.” అటు ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. తల విదిలించుకుని ఆఫీసుపనిలో పడిపోయింది అల.

ఆఫీసునుంచి సాయంత్రం యింటికొచ్చిన అలకి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్న తల్లీ, తండ్రీ, అత్తయ్యా కనపడ్డారు. అత్తయ్యని చూడగానే అలకి అప్పటిదాకా పనిలోపడి మర్చిపోయిన కౌన్సిలింగ్ సెంటర్ హఠాత్తుగా గుర్తు వచ్చింది. యెందుకు అత్తయ్య యిలా ఒంటరిగా వుండిపోయింది. మామయ్య యెక్కడుంటున్నారు.. అసలు యిద్దరూ యెప్పుడైనా కలుస్తారా.. అసలు వాళ్ళిద్దరూ యెందుకు విడిపోవలసివచ్చిందీ.. అనే ప్రశ్నలు ఆమెలో ఒక్కసారిగా తలెత్తాయి. దానితోపాటు పెళ్ళంటే మొట్టమొదటిసారిగా ఆమెలో ఒక విధమైన భయం ప్రవేశించింది. రేపు యేమవుతుందో అన్న ఆ భయం ఆ రాత్రి అలని నిద్రపోనివ్వలేదు. అలా నిద్రపట్టని అలకి ఆ అర్ధరాత్రి యెప్పటెప్పటి విషయాలో అలోచనల్లోకి వచ్చేసాయి. ఆలోచనల లింకులు ఒకదాన్ని పట్టుకుని ఒకటి అలా ఆమె చిన్నతనందాకా వెళ్ళిపోయాయి. ఆ లింకుల్లో తను స్కూల్లో చదువుతున్నప్పుడు తల్లీ తండ్రీ అస్తమానం పోట్లాడుకోవడం హఠాత్తుగా స్ఫురణలోకి వచ్చింది. అల ఎయిత్ క్లాస్ లో వుండగా జరిగిందా సంఘటన. అప్పటికే అల తల్లితండ్రులు మూర్తీ, జానకీల మధ్య మూర్తి తల్లితండ్రుల గురించి వ్యాగ్యుధ్ధం జరుగుతోంది. వృధ్ధులయినవాళ్ళని తెచ్చి దగ్గర పెట్టుకుందామన్న మూర్తి మాటలు నచ్చని జానకి ఆరోజు చాలా పెద్ద గొడవ చేసి అర్ధరాత్రి రోడ్డుమీదకెళ్ళి గట్టిగా అరుపులు మొదలుపెట్టింది. చుట్టుపక్కలవాళ్ళు యేమనుకుంటారోననే భయంతో మూర్తి జానకిని జుట్టుపట్టుకుని యింట్లోకి లాక్కొచ్చాడు. అప్పుడు జానకి హిస్టీరిక్ గా అయిపోయి మూర్తి మీదపడి అతన్ని గట్టిగా కొట్టినంత పనిచేసింది. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువొచ్చిన అల ఈ గొడవంతా చూసి బెదిరిపోయి సన్నగా వున్న పక్కసందులో ఆనించిన మడతమంచం వెనక నక్కి కూర్చుంది. ఆ రాత్రి అలకి కాళరాత్రే అయింది. ఆ సంఘటన గుర్తు రాగానే ఒక్కసారి పక్కమీంచి లేచి కూర్చుంది. అంటే తనూ, విజయ్ కూడా అలాగే దెబ్బలాడుకుంటారా.. ఛ ఛ.. ఆ పరిస్థితి తమకెందుకు వస్తుందీ. విజయ్ పేరెంట్స్ కి బ్రహ్మాండమైన యిల్లుంది. ఆయనకి పెన్షన్ వస్తుంది.

మరి లేకపోతే అత్తయ్యలా విడిపోతారా.. అసలు అత్తయ్య యెందుకు విడిపోయినట్టూ.. తుదీ మొదలూ లేని ఆలోచనలతో అలకి ఆరోజు కలతనిద్రే అయింది.

మర్నాడు శనివారం. ఉదయం అల వాళ్ళింటికి విజయ్ బ్రేక్ ఫాస్ట్ కి వచ్చాడు. అదయ్యాక యిద్దరూ వెళ్ళి షాపింగ్ చెయ్యాలని ప్లానింగ్. సుగుణ విజయ్ ని చూసి చాలా సంతోషించింది. మంచి సెలెక్షన్ చేసుకున్నావని అలను అభినందించింది. మరింక షాపింగ్ కి వెడదామా అన్న విజయ్ తో అల క్రితంరోజు తను ఫోన్ చేసిన కౌన్సిలింగ్ సెంటర్ వివరాలు చెప్పి దాని గురించి విజయ్ అభిప్రాయం అడిగింది. విజయ్ కి కూడా ఇదేదో కొత్తగా అనిపించింది. “పోనీ వెళ్ళి చూద్దామా..” అన్నాడు అలతో. “మనిద్దరికీ ఒకరిమీద ఇంకోరికి లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళు మనలను భయపెడతారేమో..” అనుమానంగా అంది అల. ఫక్కున నవ్వాడు విజయ్. “అంటే అంత వీకా నువ్వూ ” అంటూ ఉడుక్కుంది అల.

“మరైతే అపాయింట్ మెంట్ తీసుకో. యేం చెప్తుందో విందాం. మన మీద మనకి నమ్మకం వున్నప్పుడు యెందుకు భయపడాలీ.” అన్నాడు.

సంగతంతా విన్న అల తల్లితండ్రులు, అత్తయ్య కూడా అదేమిటో చూడ్డానికి వస్తామన్నారు. వెంటనే ఆ నంబర్ కలిపి అపాయింట్ మెంట్ అడిగింది. “ఎంతసేపట్లో రాగలరు?” అన్న సుస్వర ప్రశ్నకు గంటలో వస్తామని చెప్పి టైమ్ ఫిక్స్ చేసింది అల.

హైద్రాబాదులో లోయర్ టాంక్ బండ్ రోడ్ లో రామకృష్ణా మిషన్ వెనకాల వున్న గగన్ మహల్ రోడ్ లో వుందా యిల్లు. అడ్రస్ మరోసారి చూసుకుని, అదే యిల్లని నిర్ధారించుకుని కారు దిగారు అల, విజయ్,మూర్తీ, జానకీ, సుగుణలు. కారు దిగి ఆ యింటిని పరిశీలనగా చూసింది అల. చుట్టూ చాలా యిళ్ళు బహుళ అంతస్తులుగా మారిపోయినా యింకా ఆ ప్రాంతంలో అలాంటి యిండిపెండేంట్ యిళ్ళు అక్కడక్కడా కొన్ని కనిపిస్తున్నాయి. పాతకాలం పెద్దమేడల్లాగే యింటిముందు చాలా ఖాళీస్థలం వుంది. పెద్ద ఇనపగేటు. ఆ గేటుకే “ఎంజాయ్ మేరిటల్ బ్లిస్” అన్న బోర్డ్ వేలాడుతోంది. గేటు తీసుకుని అటూ యిటూ వున్న పూలమొక్కలను చూసుకుంటూ యింటివైపు నడిచారు అందరూ.

ముందున్న వరండాలోకి వెళ్ళగానే ఓ పదిహేనేళ్ళ అబ్బాయి వీళ్ళని అటువైపు వెళ్ళమన్నట్టు పక్కనే వున్న గదివైపు చూపించాడు. అందరూ అటు నడిచారు. ఆ గది చాలా పెద్దగా వుంది. ఒకవైపు మూడు వరసలలో పది కుర్చీలదాకా వున్నాయి. వాటిలో కూర్చున్నవాళ్ళకి యెదురుగా వున్న గోడలమీద కొన్ని వాక్యాలు కనపడ్డాయి. ఒక్కొక్కటీ చదవసాగారు.

“ఒకరి నొకరు ప్రేమించుకోండి. కాని ఆ ప్రేమకు కట్టడి పెట్టకండి. రెండు తీరాల నడుమ నదిలాగా మీ రెండు మనసుల మధ్యా ఆ ప్రేమను ప్రవహించనివ్వండి.

“ఒకరి పాయసపాత్రను మరొకరు నింపండి. కానీ ఒక్కదానిలోంచే యిద్దరూ తాగాలనుకోకండి.”

“ఓ దంపతులారా, మీ మనసులను చేరువ కానివ్వండి. కానీ, ఒకరి మనసు మీద మరొకరు పెత్తనం చెయ్యాలని అనుకోకండి.”

“యేదైనా భాగస్వామికి యిచ్చినప్పుడే మనకి తీసుకోగలిగే చనువు వుంటుందని తెలుసుకోండి.”

అర్ధం అయీకాకుండా వున్న ఆ రాతల్ని చదువుతున్న వాళ్ళకి లోపల గుమ్మంలోంచి ఒకావిడ రావడం, టేబిల్ ముందున్న కుర్చీలో కూర్చోవడం గమనించి యిటు తిరిగి ఆవిణ్ణి పరీక్షగా చూసారు.

ఆవిడ వయసు యాభైలోపే వుండొచ్చును. పచ్చని పసిమిఛాయ, కోలమొహం, నుదుట గుండ్రటి కుంకుమబొట్టు, చెవులకు పెద్దగా అనిపిస్తున్న వజ్రాలదుద్దులు, వత్తైన జుట్టు, బంతిపూరంగుకు యెర్రటి బార్డరున్న గద్వాలు చీర, మెడలో రెండుపేటల ముత్యాలు, పగడాలు కలిపి అల్లిన గొలుసు, చేతులకు బంగారుగాజులమధ్య యెరుపు ఆకుపచ్చ రంగుల గాజులతో సాక్షాత్తూ సాంప్రదాయానికి చీర కట్టినట్టుందావిడ.

“కూర్చోండి. నా పేరు సుస్వర..” శృతిబధ్ధమైన వీణ మీటినట్టున్న ఆవిడ సన్నని స్వరం వినసొంపుగా వుంది.

మూర్తి ఆవిడకి అందరినీ పరిచయం చేసాడు. పెళ్ళి చేసుకోబొతున్న విజయ్, అలలను చూసి ఆవిడ చిన్నగా తలపంకించింది.

“చాలా సంతోషం. అసలు ఈ సంస్థ యేమిటనే మీ కుతూహలం నాకు నచ్చింది. మనం వివాహానికి యెంత పవిత్రతను ఆపాదిస్తామో మీకు తెలుసు. ఆ వివాహబంధం హాయిగా, ఆనందంగా సాగాలనే అందరూ కోరుకుంటారు. సాధారణంగా మనందరికీ మన కుటుంబ విషయాలు, మహా అయితే బంధువుల విషయాలు మాత్రమే తెలుస్తాయి. కానీ మనకి తెలియని కోణాలు కూడా కొందరి జీవితాల్లో వుంటాయి. వాటి గురించి నేను మీకు లెక్చర్లు యివ్వను. సలహాలు చెప్పను. కానీ ఆ సంఘటనలను చిన్న చిన్న షార్ట్ ఫిల్ముల్లాగా తీసినవి మీ ముందుంచుతాను. ముందు అవి చూడండి. తర్వాత మాట్లాడుకుందాం.” అంటూ “రాజూ .” అంటూ పిలిచింది.

ఇందాకటి కుర్రాడు వచ్చి, కిటికీల తెరలు దగ్గరికి లాగి, అక్కడే గోడమీదున్న పెద్ద టీవీని ఆన్ చేసి, సిడి ప్లేయర్ లో డివిడి ఇన్సర్ట్ చేసాడు.

“ఇప్పటివరకూ మీరు మన వివాహబంధం గొప్పతనం గురించీ, దానిని నిలబెట్టుకునేందుకు భార్యాభర్తలు అనుసరించవలసిన ప్రక్రియల గురించీ చాలామంది పెద్దల దగ్గర, సైకాలజిస్ట్ ల దగ్గరా వినే వుంటారు. కానీ నిజజీవితంలో జరిగే సంఘటనలు అందుకు పూర్తిగా విరుధ్ధంగా వుంటూంటాయి. ముందు ఇవి చూడండి.” అంటూ రిమోట్ లో ప్లే బటన్ నొక్కింది సుస్వర.

ఒక అరగంటసేపు సాగిన ఆ చిత్రంలో అయిదారు నిమిషాల నిడివితో కొన్ని లఘుచిత్రాలు వున్నాయి.

ఒకదానిలో అంగరంగ వైభోగంగా జరుగుతున్న పెళ్ళిలో అకస్మాత్తుగా పెళ్ళివారిమధ్య వచ్చిన అభిప్రాయభేదాల వలన చాలా పెద్ద గొడవ జరుగుతుంది. పెద్దమనుషులు మధ్యవర్తిత్వం వహించి దానిని సర్దుబాటు చెయ్యడంతో చల్లబడి

మొత్తానికి పెళ్ళయిందనిపిస్తారు. కానీ ఆ తర్వాత కలిసి బ్రతకవలసిన భార్యాభర్తల మధ్య ప్రతిసారీ ఆ గొడవే అడ్డుగోడగా నిలిచి వారిని విడిపోయే పరిస్థితికి తీసుకువస్తుంది.

మరోదానిలో పెళ్ళిలోనే ప్రారంభం అయిన అత్తా, ఆడపడుచుల పెత్తనం పెళ్ళయాక కూడా అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతుంది. తల్లీ, భార్యా మధ్య సమతుల్యం చెయ్యలేని భర్త వల్ల ఆ భార్య విడిపోడానికి సిధ్ధపడుతుంది.

ఈ ఫిల్మ్ పూర్తవగానే సుగుణ జానకివైపు తిరిగి “ఇదేదో నా కథలాగే వుంది కదా వదినా.” అంది.

మరో ఫిల్మ్ మొదలైంది. ఇందులో వృధ్ధులైన అత్తామామలను ఈసడించుకుంటున్న భార్యను భర్త “మా అమ్మానాన్నలను యింట్లో వుండొద్దన్నావంటే నువ్వు కూడా నా యింట్లో వుండఖ్ఖర్లేదు..” అన్నాడని భర్తతో తెగతెంపులు చేసుకుంటుంది ఓ భార్య.

అది పూర్తవగానే మూర్తిని ఓరగా చూసింది జానకి.

మరోదాంట్లో సర్దుకుపోలేని భార్యాభర్తలు అవతలివారు తమమాటే వినాలనే పట్టుదలలతో అహంకారానికి పోయి విడిపోతారు.

ఇంకోదానిలో “అతనితో సరిగ్గా సంపాదించుకుంటున్నావు. అతను లేకపోతే బతకలేవా..” అంటూ యిస్తున్న పెద్దవాళ్ళ ప్రమేయం వల్ల ఇంకొందరు విడిపోతున్నారు.

యిలాగ భార్యాభర్తలు విడిపోడానికి దోహదపడే కారణాలను చూపించే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూపించింది సుస్వర. టీవి ఆఫ్ చేసి వీళ్ళవైపుకి తిరిగింది.

“అన్ని కాపురాలలోనూ దంపతులమధ్య అభిప్రాయభేదాలు రావడానికి యివే కారణాలు అవుతాయని చెప్పను. కానీ లెక్కలప్రకారం యిప్పటికి చాలామంది భార్యాభర్తలు మరీ శాడిస్టులయితే తప్పితే విడిపోడానికి కారణాలు మాత్రం యివే. దీనికి కారణం ఒక్కటే.. పెళ్ళికి ముందే అసలు కలిసి బతకడమెలాగో యిద్దరికీ తెలియాలి. అది యెవ్వరూ చెప్పటం లెదు.”

జానకి ఊరుకోలేకపోయింది. “యెందుకు చెప్పరండీ? సర్దుకుపొమ్మని యిద్దరి పెద్దవాళ్ళూ చెప్తారు. “అంది.

వెంటనే సుస్వర అందుకుంది. “అదే అందరూ చేస్తున్న తప్పు. యేం.. యెందుకు సర్దుకుపోవాలీ? “

మూర్తి తెల్లబోయేడు. సర్దుకుపోకపోతే సంసారాలు యెలా సాగుతాయి? తనలా సర్దుకుపోయి తల్లితండ్రులని ఊళ్ళోనే వుంచెయ్యడం వల్లనే కదా తన సంసారం నిలబడింది. లేకపోతే జానకి యింట్లోంచి వెళ్ళిపోయేది. అల తనకి దూరంగా పెరిగేది. యెదుటి మనిషి అర్ధం చేసుకోలేనప్పుడు మనం తగ్గక తప్పదు. అదే అన్నాడు. “అన్నీ మనం కావాలనుకున్నట్టే అవవు కదండీ” అని.

సుస్వర చెప్పింది. “యిదివరకు రోజులుకావు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చెసుకునే ఆడపిల్లలూ, మగపిల్లలూ కూడా ప్రపంచజ్ఞానం తెలిసినవారు. పెళ్ళికి ముందు మీరు మీమీ మనసులని ఈ విధంగా సిధ్ధం చేసుకోండీ అని సూచిస్తే చాలు చక్కగా వాళ్ల జీవితాలని తీర్చిదిద్దుకుంటారు.”

అప్పటివరకూ అన్నీ మౌనంగా చూస్తూ, వింటూ వున్న విజయ్, అల సుస్వరవైపు తిరిగారు.

“అసలు మీరు మాకు యేమి చెప్పదలచుకున్నారో సూటిగా చెప్పండి.” అన్నాడు విజయ్.

“అవును. ఈ డొంకతిరుగుడంతా యెందుకు? అసలు మీరు అక్కడక్కడ పెట్టిన ఆ వాక్యాల అర్ధాలేమిటి? విడిగావుంటూ కలిసివుండడమెలా సాధ్యం?”

నవ్వుతూ కుర్చీలో వెనక్కి జారగిలబడింది సుస్వర. “హమ్మయ్య. ఇప్పుడు మీరందరూ నేను చెప్పేది వినడానికి సిధ్ధమయ్యారు. సరే.. చెపుతున్నాను వినండి. ఈ వాక్యాలన్నీనా స్వంతం కాదు. వివాహబంధాల గురించి కొన్ని ఇంగ్లీషు పుస్తకాలనుంచి తీసుకుని తెలుగులో వ్రాసిపెట్టాను. యెందుకంటే పెళ్ళనగానే ముందు అందరూ పెళ్ళి కావలసిన వారిద్దరికీ సర్దుకుపోతూ హాయిగా వుండమని దీవిస్తుంటారు. అప్పటిదాకా స్వతంత్రంగా పెరిగిన పిల్లలని, అందులోనూ ఈ మధ్య వ్యక్తిత్వం కూడా వచ్చిన పిల్లలని పెళ్ళి చేసేసి సర్దుకుపొమ్మంటే వాళ్ళెలా సర్దుకుపోతారు? ఎవరు సర్దుకుపోవాలీ? ఎంతవరకూ సర్దుకుపోవాలీ? అసలు ఎందుకు సర్దుకుపోవాలీ? మనసునీ, ఇష్టాలనీ యెన్నివిధాలుగా చంపుకుంటే సర్దుకు పోగలుగుతారూ? అలా మనసుని కష్టపెట్టుకోకుండా భార్యాభర్తలు హాయిగా, ఆనందంగా జీవించలేరా అన్న ప్రశ్నకి జవాబులే నేను రాసిన ఆ వాక్యాలు.”

కాస్త ఊపిరి పీల్చుకుందుకు ఆగింది సుస్వర. కుతూహలంగా ముందుకు వంగారు అందరూ.

“మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక విషయం మటుకు తెలుసుకోవాలి. అదేంటంటే కన్నవాళ్ళు కొన్నాళ్లవరకే మనతోటి వుండగలరు. కడుపున పుట్టినవాళ్ళు రెక్కలొచ్చేంతవరకే మనతో వుంటారు. కానీ కలిసి జీవితం పంచుకునేవాళ్ళు మటుకు జీవితాంతం మనతోనే వుంటారు. అందుకని వారితో నటనలు, మోసాలు లేకుండా నిజాయితీగా వుండాలి.”

“ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, పెళ్ళి చేసుకున్నాక ప్రేమించినా వాళ్ళిద్దరూ కలిసి బ్రతకాల్సింది మటుకు ప్రేమతోనే. ఆ ప్రేమ ఒకరి మీద ఒకరికి అలాగే వుండాలంటే దానిని కట్టడి చేయొద్దు. నువ్వు ప్రేమించు, కానీ ఆ ప్రేమ అతని మీద పెత్తనం చేసే స్థాయికి మటుకు పోనీకు. లేదా అతని ప్రేమని నీమీద పెత్తనం చేసే పరిస్థితికి తెచ్చుకోకు.” అర్ధం కానట్టు చూసారు అందరూ.

“ఒకే ఇంట్లో వుంటున్నారు కదా అని ఒక్కలాగే జీవించాలనుకోకు. భాగస్వామి వ్యక్తిత్వాన్ని గౌరవించు. నీకు ఇష్టం లేని సంగీతం ఆమెకి ప్రీతిపాత్రమైతే ఆ సంతోషం ఆమెని పొందనీ. నువ్వు వినక్కర్లేదు. మీ వివాహజీవితం కలకాలం కలిసివుండాలంటే మీరు ప్రతిక్షణం అంటిపెట్టుకునే వుండక్కరలేదు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటే చాలు”

“జీవనవీణ మథురస్వరాలు పలకాలంటే ఆ వీణతీగలు విడిగా వుండి వేటిస్వరాలు అవి పలికితేనే జీవననాదం బాగుంటుంది. అంతేకాని తీగలం మేము ఒకటేగా అని కలిసిపోతే అసలు నాదమేరాదు. అలాగే భార్యాభర్తలు యెవరి వ్యక్తిత్వం వాళ్ళు నిలబెట్టుకుంటూ, యెదుటివారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తేనే ఆ సంసారంలో ఆనందనాదం వినిపిస్తుంది.”

ఏకాగ్రతగా వింటున్న అల, విజయ్ ల మొహాల్లో ఆనందం కనిపించింది.

“ఇలా ఒక్క సెషన్ లో అన్నీ చెప్పడానికి టైమ్ సరిపోదు. మీ పెళ్ళి అయేలోపల మరోసారి రండి. జీవితాంతం హాయిగా, ఆనందంగా కలిసి బ్రతకవలసిన మీరు ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు యెలా గౌరవించుకోవాలో షార్ట్ ఫిల్మ్స్ చూపిస్తాను. అప్పుడే నేను పెట్టిన ఈ ఎంజాయ్ మేరేజ్ బ్లిస్ అన్నపేరు సార్ధక మవుతుంది.”

“అసలు ఆ పేరు మీరు యేమనుకుని పెట్టేరండీ?” విజయ్ కుతూహలంగా అడిగాడు.

“మనం వివాహాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తాం. హాయిగా,ఆనందంగా వివాహ జీవితం గడపాలని పెద్దలు దీవిస్తారు. మేము చెప్పిన సలహాలు పాటిస్తే వారి దీవెనలు ఫలిస్తాయని ఆ పేరు పెట్టాను.”

అప్పటికే యిచ్చిన టైమ్ అయిపోవడం వల్ల అందరూ వెళ్ళడానికి లేచారు. మూర్తి సుస్వర ముందుకు వెళ్ళి, “ఎల్లుండి ఆదివారం మా అలకనందకు, విజయ్ కు యెంగేజ్ మెంట్ . మీరు, మీవారితో కలిసి తప్పక రావాలి.” అంటూ ఆహ్వానించాడు.

సుస్వర నవ్వుతూ, “మా పెళ్ళయి పాతికేళ్ళైంది. మేమిద్దరం విడిపోయి పదిహేనేళ్లైంది. అందుకని మావారు రాలేరు. నేను వస్తాను.” అంది.

తెల్లబోయి నిలబడిన వాళ్లందరినీ చూస్తూ, “పదిహేనేళ్ళక్రితం యిలాంటి కౌన్సిలింగ్ సెంటర్లు లేవుకదా మరీ..” అంటూ నవ్వేసింది.

కానీ అలకి మటుకు ఆ అందమైన చిలుక పక్కన గోరింక కనపడకపోవడం మనసుకు ముల్లు గుచ్చుకున్నట్టుగా అనిపించింది.



AUGUST 8, 2015, .. (తరాలు-అంతరాలు) శీర్షికన ..మాలిక అంతర్జాలపత్రిక సౌజన్యంతో..
 

Top