Romance కెమిస్ట్రీ లవ్ (ఒక ప్రేమకథ)

Member
227
229
18
కెమిస్ట్రీ లవ్ (ఒక ప్రేమకథ)

రచన:- గురుమంచి రాజేంద్రశర్మ


నా జీవితంలో నాకు వచ్చిన మూడవ ప్రేమలేఖ ఇది.

వారం క్రితం 'విరించి' నా ఫ్రెండ్ నిత్య ద్వారా పంపాడు దీన్ని.

నిత్య నా చేతికివ్వకముందే ఉత్సాహంతో తెరిచి చదివింది.
చదివాక చాలా చాలా ఆశ్చర్యపోవడమే కాదు.."ఇలాంటి ప్రేమలేఖ చదవడం నా జీవితంలో ఇదే మొదటిసారి!!!..ఇలా కూడా రాస్తారా?ప్రేమలేఖలు!!"అంది.

ప్రేమలేఖ తీసుకున్న నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు చదివానో దీన్ని!!..

అక్కడక్కడ కొన్ని మాటలు తప్ప..ఏమీ అర్థం కాలేదు!
పోనీ పక్కన పడేద్దామా?..అంటే వచ్చింది విరించి నుంచి..

నిత్య కూడా అదే అంది..

"సంహితా! నాకైతే అర్థం కాలేదే!!..పోనీ కొట్టిపడేద్దామా?అంటే ఇచ్చిన వ్యక్తి డాక్టర్ డేవిడ్ వద్ద జూనియర్లుగా పనిచేసే రీసెర్చ్ బ్యాచ్ లోనే జీనియస్ అని పేరు పొందిన విరించి.

నువ్వేమో డాక్టర్ థామస్ వద్ద పనిచేసే మన రీసెర్చ్ బ్యాచ్ లోనే జీనియస్ వి.

బహుశా తనకు తగినజోడివా ?కాదా?..అనే చిన్న పరీక్ష పెట్టాడేమో! నీకు..

ఆ ప్రేమలేఖని తొందరగా అర్థం చేసుకుని రిప్లై ఇవ్వు!!"అంటూ నన్ను ఛాలెంజ్ చేసినట్లుగా అంది.

నేను అమెరికాకు వచ్చి ఐదు సంవత్సరాలు కావస్తోంది.

నేను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో రీసర్జ్ స్కాలర్ గా ప్రఖ్యాత సీనియర్ సైంటిస్ట్ అయిన డాక్టర్ థామస్ మేడమ్ క్రింద పరిశోధనలో పనిచేస్తుంటే...

విరించి థామస్ మేడమ్ భర్త అయిన.. డాక్టర్ డేవిడ్ సార్ వద్ద నాలాగే పనిచేస్తుంటాడు.

ల్యాబ్ ఒకే బిల్డింగ్ లో కాబట్టి కనిపించినప్పుడు "హాయ్" అంటూ విష్ చేసుకోవడం..వంటి మాములు పరిచయమే తప్ప దగ్గరి పరిచయం లేదు నాకు విరించితో...

అతను నిత్యతో ప్రేమలేఖ పంపిన నాటి నుంచి..

రాత్రి ల్యాబ్ నుండి వచ్చాక రోజూ కాసేపు ఆ లేఖ చదువుతూ కుస్తీ పడుతూనే ఉన్నాను..అయినా అర్థం కాలేదు.

రీసర్జ్ రిపోర్ట్ పనిఒత్తిడి వల్ల పూర్తిగా దృష్టిపెట్టడం కుదరలేదు.

ఈరోజు ఆదివారం..సెలవు.

నిద్రలేచి ఫ్రెషప్ అయ్యాక..
ఫోన్లో "వుండర్ లిస్ట్" అనే ఆప్ ఓపెన్ చేసాను..
ఈనాటి ప్రోగ్రామ్స్ ఎమున్నాయా? అని చూశాను.

చాలా సౌకర్యంగా ఉంటుందని నేను చేయవలసిన పనులన్నీ ఈ ఆప్ లో నోట్ చేసుకుంటూ ఉంటాను!

లిస్ట్ చూస్తే..

1. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడడం..

2. విరించి పంపిన ప్రేమలేఖను అర్థం చేసుకుని ఏదో ఒక రిప్లై ఇవ్వడం

3. ప్రాచీన భారతదేశంలో కెమిస్ట్రీ పైన ఉన్న పుస్తకాలు..పరిశోధనల గూర్చి సెర్చ్ చెయ్యడం

4. సాయంత్రం 7pm కి.. మేడమ్ థామస్ కొడుకు బర్త్ డే పార్టీకి అటెండ్ కావడం.

......ఈ నాలుగుపనులు పూర్తి చెయ్యాలని పెట్టుకున్నాను ఈరోజు!!

మొదట ఇంటికి ఫోన్ చేసి అమ్మానాన్నలతో..తమ్మునితో మాట్లాడాను.

తర్వాత విరించి పంపించిన అర్థంకాని ఈ ప్రేమలేఖను ముందు పెట్టుకుని ఎలాగైనా దీని అంతుచూసి అర్థం చేసుకుందామని కూర్చున్నాను.

మరోసారి చదివాను ఆ ప్రేమలేఖని...

డియర్ "సల్ఫర్, అమెరీషియం, హైడ్రోజన్,అయోడిన్,టాంటాలం" మిశ్రమమా!!

నీలోని "కాపర్, టెలిరియం మిశ్రమాన్ని" చూసి ఎప్పుడూ కెమిస్ట్రీ రీసర్జ్ పిచ్చిలోనే ఉండే నా మనస్సు చలించిపోయింది!!

కేవలం అదొక్కటే కాదు సుమా!

నీలో "టంగ్ స్టన్-తిరిగిపోయిన టైటానియం మిశ్రమాన్ని" కూడా చూశాను.. చూశాక నా మనసు పరవశించిపోయింది!

అందుకే ఆగలేక మన కెమిస్ట్రీ బాగా కుదిరి మన ప్రేమ ఫలించి ఒక్కటవ్వాలని నేను ప్రేమించే కెమిస్ట్రీలో ఈ ప్రేమలేఖ రాస్తున్నాను!!

.......అంటూ ప్రారంభమయ్యింది!అతని ప్రేమలేఖ!!

చీ!ఎంత కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఉంటే మాత్రం అదేం సంబోధన??!!

నాలో ఏవేవో మూలకాల మిశ్రమాన్ని చూశాడట!!

రోజంతా ల్యాబ్ లో ఈ మూలకాలను చూసి చూసి నాలో కూడా అవ్వే కనిపిస్తున్నాయంటే.. ఏమన్నా కాలేదు కదా!..ఈ విరించికి!!

చిన్నప్పుడు నాక్కూడా చెస్ నేర్చుకున్న కొత్తలో కొన్నిరోజులు విపరీతంగా ఫ్రెండ్స్ తో చెస్ ఆడి ఆడి నిద్రలో కూడా చెస్ ఆటలోని పెద్ద పెద్ద ఏనుగులు.. గుర్రాలు..ఒంటెలు..భటులు..పెద్ద పెద్ద నలుపుతెలుపు గడులు.. కనిపించేవి!

అలాగే ఈ విరించికి కూడా ఏం కాలేదు కదా!..

చా!!కాదు..
ఈ ప్రేమలేఖలో ఏదో లాజిక్ ఉంది!..అదే తెలియడం లేదు!!.

విరించి కాకుండా మరెవరన్నా ఈ ప్రేమలేఖ రాస్తే ఇంత టైంవేస్ట్ చేసుకొని ఆలోచించేదాన్నే కాదు!

విరించి గురించి నిత్య ఏమేమో చెప్పింది!
ఇప్పటివరకు ఈ విరించికి ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా ఎక్సెప్ట్ చేయలేదట!
ఫ్రెండ్ గా ఉందాం!..కానీ ఈ లవ్ లు నాకు ఇంట్రెస్ట్ లేదు..ప్రస్తుతం నా దృష్టంతా నా రీసర్జ్ & కెరీర్ మీదే ఉందని చెప్పేవాడట!

నిత్య చెప్పిన మాటల వల్ల నాక్కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది విరించిపై...

కాకపోతే..

చిన్నప్పుడే ప్రేమమీద నాకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి!..అప్పటి నుంచి కొన్ని భావాలను మోస్తూ వస్తున్నాను!"మోస్తూ" అని ఎందుకంటున్నానంటే.. అవి నిజమైతాయో? లేదో?? నాకు తెలియదు మరి!!

...ఒకరకంగా ఈ భావాల వల్లే నాకు వచ్చిన మొదటి రెండు ప్రేమలేఖలు చెల్లకుండా పొయ్యాయి!

ప్రేమమీద నా అభిప్రాయాలకు కారణమైన ఆ రోజు నా కళ్ళముందు మెదిలింది.


**********************

పదోతరగతిలో ఉన్నప్పుడనుకుంటా! వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జరిగే హరికథకు.. "నేను రాను మొర్రో"..అంటున్నా వినకుండా "ఈ హరిదాసు మంచి మంచి విషయాలు చెబుతుంటాడే!విందువుగాని రా!!"అంటూ మా అమ్మమ్మ బలవంతంగా నన్ను తోడుతీసుకెళ్లింది.

స్కూలు కెళ్లినట్లు ఒక నోట్ బుక్,పెన్ను తెచ్చుకుంటున్న అమ్మమ్మని చూసి నేను పరిహాసం చేస్తుంటే..నేను విన్న,చదివిన మంచి విషయాలన్నీ ఇలా నోట్బుక్ లలో రాసుకుంటానే!!ఖాళీ ఉన్నప్పుడల్లా మళ్ళీ చదువుకుంటాను! నేను పోయాక నీకు ఉపయోగపడతాయిలే ఇవి!!అంది.

అమ్మమ్మ ఏ క్షణంలో అందో కానీ.. ఆవిడ పోయాక ఆ నోట్బుక్ లన్ని నేనే తెచ్చుకున్నాను!
అప్పుడప్పుడు చదువుతుంటాను!
నాకెంతో నేర్పాయి అవి!

ఆరోజు అమ్మమ్మతో నేను వెళ్లిన నాటి విషయాలు కూడా రాసుకుంది!..నేను కూడా ఉండడం వల్ల..ఆనాటి విషయాలు అమ్మమ్మ నోట్బుక్ లో చదవడం వల్ల ఆ రోజు ఇంకా నాకు సజీవ దృశ్యంగానే వుంది!!

ఆ రోజు "రాధామాధవ విలాసం" అనే హరికథ.

ఆ హరికథ ప్రారంభమైన కాసేపటి తర్వాత బోర్ కొట్టి అమ్మమ్మ తొడపై తలపెట్టి పడుకుందాం!..అంటూ అనుకుంటున్న సమయంలో ఆ హరిదాసు ప్రేమ విషయం తీసి ఆసక్తికరంగా చెప్పసాగాడు. ఏం చెబుతాడా? అని పడుకునేదాన్ని మళ్ళీ లేచి కూర్చున్నాను!

ఆ హరిదాసు శృతిలయలు తెలిసినవాడు కాబట్టి మాటల్లో భావాన్ని లయబద్దంగా ఒలికిస్తూ హృదయంలోకి చొచ్చుకుపోయ్యేలా మాట్లాడుతున్నాడు!!

"ఎందుకో అలంకారికులు నవరసాల్లో చోటు కల్పించలేదు కానీ..ప్రేమ కూడా రసమే!!" అన్నాడు ముందుగా!

" ఈ అలంకారికులు ప్రేమను ఎందుకు నిర్లక్ష్యం చేసి నవరసాల్లో ఒకటిగా స్వీకరించలేదో అర్థం కాదు!"..అంటూ వాపోతూ..
"నిజానికి అన్ని రసాల కన్నా మనిషిని ఎక్కువగా ఆకర్షించేది ఈ ప్రేమ రసమే" అన్నాడు.

నాక్కూడా నిజమే అనిపించింది!

ఎందుకంటే..

"ఈ ప్రేమ విషయం వచ్చేసరికి నా నిద్రమత్తు,బోర్ ఎగిరిపోయి కూచున్నా కదా!!"అనుకున్నాను!

తర్వాత అతను ఈ ప్రేమరసాన్ని వివరిస్తూ..

ప్రతీరసానికి వాటి వాటి స్థాయిభావాలు ఉంటాయి..

శృంగార రసానికి.. రతి
వీర రసానికి.. ఉత్సాహం
కరుణ రసానికి..దుఃఖం
..ఇలా అన్నిరసాలకు చెబుతూ

ప్రేమ రసానికి స్థాయి భావం "ఆనందమే" అన్నాడు..

ఒక విషయాన్ని చూసి గాని..చదివిగాని.. మనస్సు స్పందిస్తే..మనలో ఆ రససిద్ధి కలుగుతుందట!
అప్పుడు ఈ స్థాయిభావం మనలో ఏర్పడుతుందట!

కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు

ఒక సినిమాలో..లేదా నాటకంలో కథానాయకుడు వీరత్వాన్ని ప్రదర్శిస్తే మనలో ఉత్సాహం కలుగుతుందట!

అలాగే కరుణా సన్నివేశాలు బాగా పండితే.. దుఃఖం కలుగుతుందట!

హాస్యరస సన్నివేశాలుతో..నవ్వు

భీభత్స సన్నివేశాలతో..జుగుప్సా

ఇలా ప్రేమరసంవల్ల కలిగేది..ఆనందం అన్నాడతను.

తర్వాత అతడు చెప్పిన విషయాలు విని..
"అమ్మమ్మతో రాకపోయి వుంటే చాలా మిస్ అయ్యేదాన్ని!!"..అంటూ అనుకున్నాను ఆరోజు.

ఆ హరిదాసు ప్రేమ గూర్చి ఎంత అద్భుతంగా వివరించి చెప్పాడంటే...

ఇప్పటికీ అతడు చెప్పిన విషయాలు నా మనస్సులో తిరుగుంటాయి!

ప్రేమతో నిండిపోయినపుడు ఏం జరుగుతుందో వివరించాడతను!! ఆ స్టెప్స్ ను కొన్ని సంస్కృత పదాలతో వివరించాడు ఆ హరిదాసు!

ప్రేమించినవ్యక్తిపై మొదట "ప్రీతి" కలుగుతుందట!

ప్రీతి అంటే ఇష్టం..అని అర్థం చెబుతూ..
ఆ ఇష్టపడిన వ్యక్తికోసం ఎంత కష్టమైనా ఓర్చుకుంటారట!
"నిజానికి అది కష్టమే అనిపించదు ఆ సమయంలో".. అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పాడు!

తాను బాగా ఇష్టపడే హీరోసినిమాకి ఒక కుర్రాడు ఎంత కష్టమైనా లైన్లలో నిలబడి టికెట్టు కొనుక్కుంటాడు!..
వాడికి అది కష్టం అనిపిస్తుందా?

ఆ సమయంలో..
వాడి దృష్టి అంతా తాను ఇష్టంగా చూడబోయే తన హీరోసినిమా మీదే ఉంటుంది!

అలాగే ఇంట్లో కొన్ని పనులకే విసుగు చెందుతుండే కుర్రాళ్ళు ఎంత కష్టమైనా గంటల తరబడి క్రికెట్టు ఆడుతారు!..ఎందుకంటే అది వారికిష్టం కనుక!!అలా ఆడుతున్నప్పుడు శరీరానికి శ్రమ కలిగినా..చివరకు దెబ్బలే తాకినా కష్టం అనిపించక పోగా ఆనందమే కలుగుతుంది!

అలాగే ప్రేమించిన వ్యక్తి పట్ల కూడా అదే ఇష్టంతో ఎంత కష్టమైన భరిస్తారు!"..అంటూ చెప్పాడు.

..అప్పుడు ఆ హరిదాసు ఈ విషయాలు చెబుతుండగా నేను వింటున్న దృశ్యం గుర్తొస్తే నవ్వొస్తుంది..

అప్పుడే నాలో వయస్సు మొగ్గతొడుగుతున్న రోజులవి!

అతను ఈ ప్రేమ ప్రభావాన్ని చెబుతుంటే ఇట్లా నిటారుగా కూర్చొని నోరెళ్ల బెట్టి ఆశ్చర్యంగా వింటుండిపోయాను ఆ రోజు!!

తర్వాతి రెండో స్టెప్ "సమ్మానం" అన్నాడు.

సమ్మానం అంటే గౌరవం ఆట!

"ప్రేమ అనే పుష్పం వికసిస్తే వచ్చే పరిమళమే గౌరవం"అన్నాడు.

అతను మరొకమాట చెప్పాడు

"ఎంత నటించినా నిజానికి మనం ఇష్టపడని వ్యక్తిని ఎప్పటికీ గౌరవించలేము!"..అంటూ!!

ప్రేమించిన వ్యక్తి పట్ల ఇష్టంతో పాటు గౌరవం కూడా కలుగుతుంది.. అంటూ చెప్పాడు.

మూడవ స్టెప్"అప్రాతికూల్యం"అన్నాడు.

అంటే ప్రేమించే వ్యక్తి పట్ల వ్యతిరేకంగా ఒక్క మాటకానీ,ఆలోచనకానీ,పనికానీ ఉండవట..

అసలు మనసు ఆ వ్యక్తి గూర్చి కొంచెం కూడా వ్యతిరేకంగా ఆలోచించదట!..ఇంకా మాటలూ.. చర్యలు ఎలా ఉంటాయని" ప్రశ్నించాడు.

నాలుగవ స్టెప్ "సంతతం"అన్నాడు.

అంటే.. ఆ ప్రేమను ఒక సంతతధారగా..ఎడతెరపి లేకుండా నిరంతరం ప్రేమించేవ్యక్తిపై కురుపిస్తూనే ఉంటారట!

ఐదవ స్టెప్ "నభయం"అన్నాడు.

అంటే..ప్రేమించే వ్యక్తి పట్ల కొంచెం కూడా భయం ఉండదట!
పైగా ఆ వ్యక్తి తనకున్నాడనే ధైర్యమే ఆత్మవిశ్వాసానికి తోడై మరింత పరిపుష్టిని కలిగిస్తుందట!

ఆరవ స్టెప్ "నఫలాపేక్షకం" అన్నాడు.

"ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు!".."ఒక తల్లిలాగా ఏమీ ఆశించకుండా ఇచ్చేదే ప్రేమ!!"అన్నాడు.

ఒకవేళ ప్రతిఫలం కోరుకుంటే అది వ్యాపారం అవుతుంది కానీ..ప్రేమ ఎలా అవుతుంది??..అంటూ ప్రశ్నించాడు!

ఏడవ స్టెప్ "విరహం"అంటూ చెప్పాడు.

ఈ స్థితిలో ప్రేమించినవ్యక్తి దూరంగా వుంటే మళ్ళీ కనిపించేవరకు విరహవేదన ఉంటుందట!

ఈ విరహవేదనలో ప్రేమించిన వ్యక్తి గూర్చిన ఆలోచనల ధ్యానమే ఉంటుందట!

అన్ని వేదనల్లోనూ ఇష్టమైన వేదన ఏమిటో తెలుసా!
ఈ విరహవేదననే!!...
ఈ విరహవేదన చాలా పెద్ద బాధనే..కానీ అది ఇష్టమైన బాధ !!...అంటూ వివరించాడు!

ఎనిమిదవ స్టెప్ ను "తదర్థ శరీర సంస్థానం" అన్నాడు

అంటే ఆ ప్రేమించిన వ్యక్తి కోసమే ప్రాణాలు నిలిచి ఉన్నాయనే అనుభూతి పొందుతారట!!..

చివరిదైన తొమ్మిదవ స్టెప్ ను"తదీయం" అన్నాడు.

ఇక్కడ అహం పూర్తిగా శూన్యమై "నాది అనేది ఏదీ లేదు అంతా నువ్వే!!" అంటూ ఒక మంచుగడ్డ కరిగి సముద్రంలో లీనమైనట్లు మొత్తం ప్రేమించిన వ్యక్తి ఫీలింగ్ తోనే ఉంటారట!

ఇలాగే...రాధ కూడా మాధవుని ప్రేమించింది!..కామించింది!
అతనికోసం..ఆరాటపడింది!..ఆక్రోశపడింది!..అలమటించింది!!..ఆవేశపడింది!!..అనునయించింది!..అనుభూతి చెందింది!..చివరికి అతనితోనే పూర్తిగా నిండిపోయి అతనిగానే మారిపోయింది!!

ఒకదశలో కృష్ణుని పొందలేకపోయితినే అనే విరహవేదనవల్ల పొందిన మహాదుఖం ఆమె పాపాలను నశింపజేసిందట!

శ్రీకృష్ణుని భావాలు మనస్సులో నిండగా పొందిన అనంత ఆనందం వల్ల ఆమె పుణ్యం కూడా పూర్తిగా ఖర్చు చెయ్యబడిందట!

..ఇలా ఆమె పుణ్యపాపలు తొలగి ముక్తురాలు అయ్యిందట!!

..నిజానికి ఈ ప్రేమనే భగవంతుని పైకి మరల్చితే అదే భక్తి అవుతుంది!

ప్రేమ..భక్తి ఒకే స్వరూపం.

ఈ ప్రేమించే వ్యక్తికి ఏర్పడే మొట్టమొదటి అర్హత ఏమిటో తెలుసా?

"నిగ్రహం"

అంటే...ప్రేమించేవ్యక్తి కోసం ఏ సుఖాన్నైనా త్యాగం చేయగలిగే మానసిక ధృతి.

...ఇదిగో ఇక్కడివరకే నాకు గుర్తుంది!!

నన్ను ప్రేమించానని ఎవరన్నా చెబితే వారికి ఈ నిగ్రహం పరీక్ష పెట్టాలి!..అని ఆ హరికథ వింటూ ఆ 15 ఏళ్ల వయస్సులో నిశ్చయించుకున్నాను!

అప్పుడు ఎంత గట్టిగా ముద్రపడిందో కానీ,వదిలించికుందామని ఎంత ప్రయత్నించినా నాలో ఈ భావం..ఈ పరీక్ష పట్ల పట్టుదల పోవడం లేదు!

అందుకే అన్నాను ఈ భావాన్ని మోస్తూ ఉన్నానని!!

పాపం!!ఇలా నేను ఈ నిగ్రహపరీక్షలు పెట్టడం వల్లనే నాకు మొదట వచ్చిన రెండు ప్రేమలేఖలు చెల్లకుండా పొయ్యాయి!!

కెమిస్ట్రీ లవ్ అంటూ మొదలుపెట్టి ఇలా హరికథ చెప్పడం మీకు ఒకరకమైన విసుగును తెప్పించడం లేదా?

మీలాగే నా పరిస్థితి కూడా వుంది!!నా భావాన్ని మోస్తూ!!

నిజంగా ప్రేమించేవ్యక్తిని అన్వేషించాలని ఒకవైపు..
మరోవైపు ఇదిఅసలు జరిగే అవకాశం ఉందా?
నా భావంలో ఏమైనా సారం వుందా? అనే సందేహం మరోవైపు!!

*********************

నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అనుకుంటాను..ఒకబ్బాయి నాకు మొదటి ప్రేమలేఖ రాశాడు!

ఒక కవితలా రాసి..చివరకు "సంహితా! ఐ లవ్ యూ!!" అంటూ..

నేను అతని గురించి ఎంక్వైరీ చేశాను! అతనికి "పాన్ పరాగ్ గుట్కా" అలవాటు ఉందని తెలిసింది!

అతడు కలిసినప్పుడు"ప్రేమించేవ్యక్తి కోసం ఏ సుఖాన్నైనా త్యాగం చేయగలవా నువ్వు!" అంటూ అడిగాను!

అతను ఒక్క క్షణం వీస్తుపోయి "సంహితా!నీకోసం ఏమైనా చేస్తాను నేను!!"అన్నాడు.

అయితే 'పాన్ పరాగ్ గుట్కా'అలవాటు మానేయ్!..అప్పుడు నా ప్రేమ విషయం ఆలోచిస్తాను! అన్నాను.

సరే అంటూ వెళ్ళాడు...
కానీ, అతను 'పాన్ పరాగ్ గుట్కా'వదిలిపెట్టలేదు...నా మీదున్న ప్రేమని వదిలిపెట్టాడు!!

తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ లో మరో అబ్బాయి ప్రేమలేఖ రాశాడు!

నా అందాన్ని పొగుడుతూ రాస్తూ.."నువ్వు లేకుండా నేను బ్రతకలేను! ఐ లవ్ యూ! నువ్వు ఒప్పుకోకుంటే మరోసారి నా రక్తంతో రాస్తాను ప్రేమలేఖ!!"అంటూ రాశాడు!

రక్తంతో రాయడం ఎందుకు??
నేనెందుకు ఒప్పుకోను?..
పైగా నాక్కావాలసిందే ఇది!!
నిజానికి అప్పుడు నా స్థితి ఎలా ఉంది అంటే..
ఎంత మంది నన్ను ప్రేమిస్తే అంత మంచిది!
అందరికి ఈ నిగ్రహ పరీక్షలు పెట్టవచ్చు!..అనుకుంటూ ఉబలాటపడేదాన్ని!

కానీ దురదృష్టవశాత్తు నాకప్పుడు రెండు మాత్రమే వచ్చాయి

ఈ రెండో ప్రేమలేఖ చూసి చాలా సంతోషించాను..మరో పరీక్ష పెట్టే అవకాశం వచ్చినందుకు!!

ఏం పెట్టాలా?.. అని ఆలోచించాను.
నేనప్పుడు తెల్లవారుజామున 5 గంటకు యోగ క్లాసులకు వెళుతున్నాను..రమ్మంటే?.. అని ఆలోచించాను..
నాతో కలవచ్చు.. మాట్లాడొచ్చు..బయటకు తీసుకెళ్ళొచ్చు!!.. అనుకుని వస్తాడేమో! ఎక్జామ్స్ ముందు డిస్టపెన్స్ ఎందుకు? ఇది కూడా పెడుదాం!అనుకుని..

అతను కలిసినప్పుడు అతనికి కూడా నా ప్రేమ పరీక్ష విషయం చెప్పి "ప్రతీరోజూ 5am కు నేను వెళ్లే ఈ యోగా క్లాసులకు రా!..ఒక 6 నెలల వరకు మన ఎక్జామ్స్ అయ్యే వరకు నాతో మాటకూడా మాట్లాడవద్దు!!"..అంటూ చెప్పాను.

ఒక నెల రోజులు వచ్చాడు..నవంబర్ చలికాలం ప్రారంభం కాగానే మానేశాడు!..

మా యోగా మాస్టారు బాగా కఠినాత్ముడు!!
పాపం!ఒళ్ళంతా హూనం అయ్యేలా యోగాసనాలు..సూర్యనమస్కారాలు చేయిస్తుంటాడు.. పోనీ.. ప్రియురాలుతో మాట్లాడుదాం!..కాస్తా సినిమాలో..పార్కులో అంటే అదీ లేదు!
అతనికి ఏం ఎంజాయ్ మెంట్ ఉంటుంది?...

అందుకే తర్వాత వాళ్ళ ప్రక్కింటి అమ్మాయికి రక్తంతో ప్రేమలేఖ రాసి లవ్ లో పడ్డట్టు తెలిసింది!!

మళ్ళీ ఇంతకాలానికి ఈ మూడో ప్రేమలేఖ వచ్చింది..

అప్పటికీ ఇప్పటికీ అన్ని విషయాల్లోనూ నాలో కాస్తా జ్ఞానం పెరిగిందనే అనుకుంటాను!..కానీ ఆ 15 ఏళ్ల వయస్సులో పడ్డ ఆ అభిప్రాయం మాత్రం పోలేదు!..

అందుకే ఫ్రాయిడ్ అంటాడేమో! బాల్యంలో పడిన ముద్రాలూ,జ్ఞాపకాలు చాలా బలంగా ఉంటాయని!!!

వేరేవాళ్ళు ఎవ్వరైనా విరించి రూపం,జ్ఞానం,పొజిషన్ చూసి కళ్ళుమూసుకుని ఒప్పేసుకుంటారు!
నాకు మాత్రం అతనికి కూడా ఒక పరీక్ష పెట్టాలనే ఉబలాటమే ఉంది.

కానీ, అతనే నాకు ఈ ప్రేమలేఖను ఇలా ఎలిమెంట్స్ తో (మూలకాలతో)నింపి పరీక్ష పెట్టాడు..

మళ్ళీ మళ్ళీ చదివాను!! ఆ ప్రేమలేఖని!!!..వచ్చిన ఈ మూడవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అతనికి కూడా 'నిగ్రహపరీక్ష' పెట్టాలనే నా కోరిక నెరవేరేలా లేదు!

ఆ ప్రేమలేఖ అర్థం కావడం లేదు!
ఇలా అయితే ఈరోజంతా వృథాగా గడిచిపోయ్యేలా వుంది అనుకొని..దీని విషయం మళ్ళీ చూద్దామని.. ఈరోజు చేద్దామనుకున్న మూడవపని ముందర వేసుకున్నాను!

ప్రాచీన భారతదేశంలో రసాయన శాస్త్రం గురించి..

ఇంటర్ నెట్ లో సెర్చ్ చేస్తే తెలిసిన విషయాలు ఇవి!

మొదట ఋగ్వేదంలో అణు ప్రసక్తి వచ్చిందట!

మంత్రపుష్పంలో ఆత్మ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అన్న ప్రశ్నలకి సమాధానం చెబుతూ ఋగ్వేదంలో ఉన్న మంత్రపుష్పంలో "నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా" అని ఉందట!. ఇది ఋగ్వేదంలో ఉన్న మంత్రం. దీనిని భారతదేశంలో పూజలో హారతి తర్వాత పఠిస్తూ ఉంటారట!!. నీవార ధాన్యపు మొనలా అణు ప్రమాణంలో ఆత్మ హృదయ పీఠంలో ఉంది అని అర్థమట. ఇక్కడ వాడిన మాట "అణు."

తర్వాత ప్రాచీన భారతదేశంలో "కణాదుడు" అణుసిద్ధాంతాన్ని ప్రతిపాదించేడట.

ఆయన ప్రపంచంలోని వస్తువులన్నీ "అణువు"ల సముదాయం అన్నారు. ఆయన "అణువు" అన్న మాటనే వాడినా.. నిజానికి అతను "అణువు" అంటూ పిలచింది ఈనాటి atom ని..ఎందుకంటే మోలిక్యూల్ గూర్చి కూడా చెప్పాడతను.

ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడు..
ఇతడు రసాయన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశాడట!

ప్రపంచంలో పాదరసం వాడకాన్ని మొదటి సారిగా ప్రయోగించాడట!

బట్టీ పట్టటం (డిష్టిలేషన్ )..శుద్ధిచేయటం (సబ్లిమేషన్ )..భస్మం చేయటం (కాల్సినేషన్ )మొదలైన పద్ధతుల్లో లోహాలపరిశోధనలు చేశాడట!

...అతను రాసిన గ్రంథాలు,పరిశోధనలు చదువుతూ
నాగార్జునుడు పాదరసంతో బంగారం తయ్యారుచేశాడని చదివాను!

పాదరసం అంటే ఏంటి?అని చూస్తే మెర్క్యూరి అని ఉంది. పిరియాడిక్ టేబుల్ (మూలకాల ఆవర్తన పట్టిక) ముందర వేసుకున్నాను.

ఈ పాదరసానికీ..బంగారానికి మధ్య ఒకే ఒక ఎలక్రాన్,ప్రోటాన్ తేడా ఉంది. అతడు తన ప్రయోగాల ద్వారా ఆ తేడా తొలగించి పాదరసాన్ని బంగారంగా మార్చాడు..

నిజంగా ఎంత గొప్ప ఆలోచన..నేను భవిష్యత్తులో ఈ విషయంపై రీసెర్జ్ చెయ్యాలనుకున్నాను!

ఆ పిరియాడిక్ టేబుల్ చూస్తున్నప్పుడే మెరుపులా విరించి రాసిన ప్రేమలేఖలోని లాజిక్ నా మెదడుకు తట్టింది!

వెంటనే మళ్ళీ ఆ ప్రేమలేఖ ముందువేసుకున్నాను!

డియర్ "సల్ఫర్, అమెరీషియం, హైడ్రోజన్,అయోడిన్,టాంటాలం" మిశ్రమమా!!

అని వుంది.. ఆ మూలకాల రసాయన సాంకేత నామాలను రాశాను

సల్ఫర్..S
అమెరీషియం..AM
హైడ్రోజన్..H
అయోడిన్..I
టాంటాలం..Ta

నా పెదవులపై నవ్వు ఉదయించింది..ఎంత సంతోషం వేసిందో చెప్పలేను..చాలా చిన్న లాజికే!! కానీ..అర్థం చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది.

ఆ సాంకేత నామాలను ప్రక్క ప్రక్కనే రాస్తే..

డియర్ SAMHITa(సంహితా!).. అంటూ ఆ ప్రేమలేఖలో సంబోధించాడు!

అతని ఐడియాకి ముచ్చటేసింది!..
ఆ ప్రేమలేఖ రాయడంలో అతని ఆలోచన అర్థంఅయ్యాక అతనిలోని క్రియేటివిటీ, జీనియస్ అర్థమయ్యాయాయి!

తర్వాత లైన్..

నీలోని "కాపర్, టెలిరియం మిశ్రమాన్ని" చూసి ఎప్పుడూ కెమిస్ట్రీ రీసర్జ్ పిచ్చిలోనే ఉండే నా మనస్సు చలించిపోయింది!!

రసాయన సాంకేత నామాలను చూశాను

కాపర్..Cu
టెలిరియం..Te

.. నీలోని క్యూట్(అందాన్ని,ఆకర్షణను) ను చూసి ఎప్పుడూ కెమిస్ట్రీ రీసర్జ్ పిచ్చిలోనే ఉండే నా మనస్సు చలించిపోయింది!!..అని అర్థం ఆ మాటకి!

"అతడు నా అందాన్ని పొగడడం నాకిష్టమే!..కానీ,అంతకన్నా ఎక్కువ నాలో ఉన్న విషయాలు చూసినప్పుడే నాకు తృప్తి"..అనుకుంటూ
తర్వాత ఏం రాశాడో చూశాను

కేవలం అదొక్కటే కాదు సుమా!

నీలో "టంగ్ స్టన్-తిరిగిపోయిన టైటానియం మిశ్రమాన్ని" కూడా చూశాను.. చూశాక నా మనసు పరవశించిపోయింది!

మళ్ళీ రసాయన సాంకేత నామాలను చూస్తే..

టంగ్ స్టన్..W
టైటానియం..Ti
"తిరిగిపోయిన టైటానియం".. అన్నాడు..అంటే iT

..Wit ను చూశాడు నాలో!!

ఇంగ్లీష్ లో Wit అంటే మెంటల్ షార్ప్ నెస్..తెలివి..తొందరగా అవగాహన చేసుకునే శక్తి..అంతేకాదు, సెన్సాఫ్ హ్యూమర్ తో హాస్యంగా మాట్లాడుతూ ఎప్పుడూ ఆనందంగా వుండే స్వభావం.

ఒకేఒక చిన్నమాటలో నన్ను ఆవిష్కరించాడు!
నా మనస్సు సంతోషంతో ఎగిరెగిరి పడసాగింది!...

నన్ను ప్రేమించేవ్యక్తి నా శరీరానికి ఉన్న అందం కన్నా..నాలోకి తొంగి చూసి మనసుకున్న అందాన్ని చూడాలనుకుంటాను!

అలా నాలో గొప్పగా ఉన్నాయని నాకు నేను భావించే గుణాలను విరించి గమనించాడు..అందుకే ఆ సంతోషం!!

............ఇలా మిగతా మొత్తం ప్రేమలేఖ అర్థం అయ్యింది..ఒకేఒక్క ప్రేమలేఖతో తనని తాను ఎంత బాగా అర్థమయ్యేలా చేసుకున్నాడు..
అంతే కాదు,నేను ఉట్టిసరుకునా?..గట్టి సరుకునా?? అనేది కూడా చూశాడు!

విరించిని ఎలాగైనా వదులుకోవద్దనిపించింది!

మరి నేను మోస్తున్న భావం సంగతి? 15 సంవత్సరాల వయస్సు నుండి పెట్టుకున్న నా నిగ్రహపరీక్ష నియమం సంగతి?????

మనస్సులో ఒక సంఘర్షణ...ఏం నిర్ణయం తీసుకోవాలి అని!!!
కాలమే నిర్ణయించాలి మరి!!!!

**********************

ఈరోజు నేను చేయవలసిన చివరిపని నాలుగవది.. "థామస్ మేడమ్ -డేవిడ్ సార్" వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు పార్టీకి అటెండ్ కావడం!

ఆ పార్టీకి విరించి కూడా తప్పకుండా వస్తాడు!
అప్పుడు ఇవ్వడానికి రిప్లై లెటర్ మొదట అందంగా..అతడు రాసినట్లే రాద్దామనుకున్నాను! ఇంకా నా నిగ్రహపరిక్ష పూర్తికాలేదు..అదీగాక నేను పార్టీకి వెళ్లే సమయం దగ్గరపడింది!

చివరకు సింపుల్ గా ఇలా రాశాను.
అతను రాసిన ప్రేమలేఖ నాకర్థమయ్యిందని చెప్పడానికి అన్నట్లుగా!!

విరించిగారూ!
మీరు నా జీవితంలో..
"హైడ్రోజన్, ఎర్భియం,ఆక్సిజన్"మిశ్రమం కావాలంటే ఒకసారి మాట్లాడుకోవాలి మనం!!

రసాయన సాంకేత నామాల ప్రకారం ఆ మిశ్రమం
హైడ్రోజన్ H..ఎర్భియం Er..ఆక్సిజన్ O... అంటే HERO(హీరో) అవుతుంది.

నిత్య, నేను మరికొందరు ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పార్టీకి వెళ్ళాము!
విరించి అప్పటికే వచ్చాడు!
మమ్మల్ని చూడగానే దగ్గరకు వచ్చి నవ్వుతూ విష్ చేసి వెళ్ళాడు..

అతడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ప్రక్కనే ఉన్న నిత్య నన్ను గిల్లింది..అతడు వెళ్ళాక " ఆ లవ్ లెటర్ అర్థమైందా?రిప్లై తెచ్చావా ??"..అంటూ గుసగుసగా అడిగింది చెవిలో..

నేను తలూపాను!

"ఒప్పుకో!మంచోడు!!..నాకే గనుక ప్రపోజ్ చేసుంటే ఎగిరిగంతేసేదాన్ని!!"..అంది

"చూద్దాం!" అన్నాను ముక్తసరిగా!!

డిన్నర్ చేయకుండా నిమ్మరసం పిండుకుని పల్చటి మజ్జిగ మాత్రమే తాగుతున్న నన్ను చూసి...

"మీరు డిన్నర్ చేయడం లేదేంటి?"..అంటూ అడిగాడు విరించి.. నా దగ్గరకు వస్తూ..

"ఈ మధ్యే కాస్తా వెయిట్ పెరిగానండీ! తగ్గించుకుందామని నిన్నటినుంచి ఒక పదిరోజుల వరకు "వీరమాచినేని డైట్ "ఫాలో అవుతున్నాను..
వచ్చేటప్పుడే నా స్పెషల్ ఫుడ్ తీసుకునే వచ్చాను."..అంటూ బదులిచ్చాను.

"వెయిట్ పెరిగారా? నాకైతే సరిగ్గా..అందంగా కనిపిస్తున్నారు!" అన్నాడతను.

"హైట్ కి తగ్గ వెయిట్ ఉండేలా చూసుకుంటాను! అందుకే!!" అన్నాను కాస్తా సిగ్గుపడుతూ..

తర్వాత అతనికి నేను తెచ్చిన"రిప్లై లెటర్" ఇచ్చాను.
నా ముందే అది చదివి "ఎప్పుడు కలిసి మాట్లాడుకుందాం!"అన్నాడు చిరునవ్వుతో..

"వచ్చే ఆదివారం"..అంటూ బదులిచ్చాను.

"ఎక్కడ?"అడిగాడు విరించి.

"వెంకటేశ్వర టెంపుల్"

***********************

వచ్చేటప్పుడు నిత్యతో "విరించి గురించి తెలుసుకోవే!..అతనికి ఏమైనా దురలవాట్లు ఉన్నాయా? ..ఇంకా మిగతా విషయాలు కూడా!!"అన్నాను.

"సరే!తప్పకుండా తెలుసుకుంటాను!"..అంది.
దానికి ఇలా అందరి విషయాలు తెలుకోవడం బాగా ఆసక్తి కూడా!!

ఒక రెండు రోజుల్లోనే చెప్పేసింది అతడి వివరాలన్నీ!

దురలవాట్ల గూర్చి చెబుతూ..

"సంహితా! నేను తెలుసుకున్న దాన్ని బట్టి అతనికి పెద్దగా దురలవాట్లు లేవు..రోజూ 4,5 సిగరెట్లు మాత్రం తాగుతాడట!..
కాకపోతే చాలా జీనియసే కాదు..సిన్సియర్ కూడా!అందరిలో తొందరగా కలిసిపోతాడు! నవ్వుతూ..నవ్విస్తూ మాట్లాడతాడు!..ఇంకా ఇండియాలో వాళ్ళు మీ ఊరి ప్రాంతంలోనే ఉంటారట!ఇంకా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అతనిలో..ఒప్పుకో! ఆ సిగరెట్ విషయం పెళ్ళైతే మార్చుకోవచ్చు!!"..అంటూ చెప్పింది.

నాక్కావాలసింది దొరికింది.

"సరే చూద్దాంలే!!"..అంటూ ఇంటికి వచ్చేశాము నిత్యానేను.
నిత్య అమ్మానాన్నలు అమెరికాలోనే వేరే స్టేట్ లో ఉంటారు.అది నాతో పాటే వుంటోంది.. సెలవులు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళింటికి వెళ్లివస్తూ ఉంటుంది.

*************************

తర్వాతి ఆదివారం
ఉదయాన్నే అనుకున్న సమయం కన్నా కాస్తా ముందుగా వెంకటేశ్వర టెంపుల్ వెళ్లి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాను.

నాకు చాలా ఇబ్బందిగా ఉంది నా నిగ్రహపరీక్ష గూర్చి చెప్పాలంటే...
డిగ్రీలో ఆ ప్రేమలేఖలు వచ్చినప్పుడు ఇలా ఇబ్బంది పడలేదు.మోహమాటం లేకుండా సూటిగా చెప్పేశాను!

ఇప్పుడలా చెప్పడం ఒక చిన్నపిల్ల ప్రవర్తనలా అనిపిస్తుంది.. పోనీ ఇష్టం లేకుంటే వేరు!..అతనంటే నా మనసులో ఒక ఇష్టం ఏర్పడింది..
కానీ టెన్త్ క్లాస్ నుండి నేను మోస్తున్న భావం నన్ను వదలడం లేదు.

కాసేపటికి విరించి కూడా దర్శనం చేసుకుని నా వద్దకొచ్చాడు!

నన్ను చూసి విష్ చేసి ఒక పూల బొకే అందించాడు.
తర్వాత..అతని చేతిలోని కొబ్బరి ముక్క కూడా
"ఇదిగో నీ వీరమాచినేని డైట్ కి ఇది పనికివస్తుంది!"..అంటూ ఇచ్చి..
"సంహితా! ఏదైనా ఇబ్బందికర విషయముందా? ఏమైనా అడగాలా నన్ను? "..అడిగాడు చిరునవ్వుతో

"ఎందుకలా అనుకున్నారు" అంటూ ప్రశ్నించాను నేను.

"మరేం లేదు..ఏ విషయమైనా ఫోన్ లో కానీ,వాట్సాప్ లో కానీ అడగగలవు కదా!..కొంచెం అడగడానికి ఏదో ఇబ్బందికర విషయం ఉంటేనే ఇలా ప్రత్యేకంగా కలవాలని అనుకుంటారు!
కొంపదీసి సినిమాల్లోలా పరీక్షలేమి పెట్టవుగా నా ప్రేమకి?"..అంటూ నవ్వుతూ అడిగాడు.

ఆశ్చర్యపోయాను అతని పరిశీలనకి!

ఒక వ్యక్తిని ఇష్టపడితే అతనిలోని చిన్న చిన్న విషయాలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయేమో కూడా!

చివరకు కొబ్బరివక్క ఇచ్చి..వీరమాచినేని డైట్ కి పనికొస్తుందని చెప్పడం కూడా నా పట్ల కేర్ తీసుకోవడంగా.. నా పనికి సపోర్ట్ గా..నాతో పాటు నా నిర్ణయాలను గౌరవించినట్లుగా అనిపించింది.

"పనికివస్తుంది.. అంటూ చెప్పాడంటే ఆ పార్టీ రోజు నా మాటలు విని వీరమాచినేని డైట్ గూర్చి సెర్చ్ చేసి ఉంటాడుగా!" అనిపించింది నాకు!

"ఏం పరీక్షలుంటాయి? పోనీ ఏదైనా దురలవాట్లు ఉన్నాయనుకుంటే మానేయమనొచ్చు!!..అలా కూడా ఏం లేవుగా మీలో?" అన్నాను అతడడిగిన ప్రశ్నకి సమాధానంగా చిరునవ్వుతో..

"ఎందుకు లేవు..బోలెడన్ని ఉన్నాయి!

రోజూ సిగరెట్లు తాగుతుంటాను!

ఇంకా నా సబ్జెక్టు రీసర్జ్ లో పడ్డానంటే అన్నీ మర్చిపోతాను..ఎంత సమయం గడిచిందో కూడా తెలియదు..ఈ అలవాటు పెళ్లిచేసుకున్న భార్యకి తనని కేర్ లెస్ చేసినట్లు అనిపించొచ్చు..

అంతే కాదు ఏ విషయంలో నైనా ఓకేతీరుగా తీవ్రమైన ఏకాగ్రతలో పడుతుంటాను.
అంటే సినిమాలు చూస్తే ఒక వారం పాటు ఒకే తీరుగా చూస్తాను..ఏవైనా పుస్తకాలు చదివితే ఒకే తీరుగా చదువుతాను...ఈ నా అలవాటు కూడా నా భార్యకి ఇబ్బందిగా మారొచ్చు!

కాకపోతే నేను గమనించినదాన్ని బట్టి ప్రేమించినవాటి పట్ల నా ఏకాగ్రత యొక్క తీవ్రత శాశ్వతంగా ఉంటే...

రిలాక్స్ కోసమో..ఆటవిడుపు కోసమో చేసే ఈ మాములు ఇష్టాల పట్ల తీవ్రఏకాగ్రత తాత్కాలికంగా ఒక వారం పాటు ఉండొచ్చు!!

అయితే ఇప్పటివరకు నేను ప్రేమించినవి రెండే రెండు విషయాలు.
ఒకటి నా కెమిస్ట్రీ సబ్జెక్టు
రెండు నువ్వు!!"..అంటూ చెప్పాడు విరించి నా కళ్లలోకే చూస్తూ..

"ఇలా ఒకే తీరుగా నా కళ్లలోకే చూడ్డం కూడా ఆ తీవ్ర ఏకాగ్రత లక్షణమేనా? " అన్నాను నేను అతని ముఖంలోకి చూస్తూ..నా మాటలకి అతని ఫీలింగ్స్ గమనిద్దామని!!

నా మాటలు విని మనస్సుకు హాయి కలిగించేలా నవ్వాడతను. తర్వాత..

"చూస్తూ ఉండరా మరి! నేను ప్రేమిస్తున్న నువ్వు నాకు ఎనిమిదో వింతకాదు...మొదటి వింత.
నిన్ను చూస్తున్నా కొద్దీ క్రొత్త క్రొత్త వింతలు..అందాలు కనిపిస్తూనే ఉన్నాయి మరి!అందుకే ఆ తీవ్ర ఏకాగ్రత!!" అన్నాడతను ఇంకా నాకళ్లలోకే చూస్తూ...

సమయస్ఫూర్తిగా స్పందించిన అతనిమాటలు నాకు ఆహ్లాదాన్ని.. కాస్తా సిగ్గును కూడా తెప్పించాయి!

ఎంతైనా జీనియస్ కదా!
మరో ఆలోచన కూడా వచ్చింది..
అతని మాటలు అతిశయోక్తిగా అనిపించినా నిజం కూడా ఉండొచ్చు!
ఎందుకంటే..
మాములు వ్యక్తులు ఏదో మాములుగా చూసి అర్థమైందనుకుంటారు!..తృప్తి పడతారు!!

జీనియస్ లు అలా కాదు!
వాళ్ళు నిరంతరం గమనిస్తూ..పరిశీలిస్తూనే ఉంటారు కాబట్టి ఇతరులకు మాములుగా అనిపించిన వాటిల్లో కూడా క్రొత్త అందాలనూ..క్రొత్త అనుభూతులనూ..కొంగ్రొత్త భావాలను దర్శించగలుగుతారు!!

ఒక అమ్మాయికి కావలసింది కూడా అదే! తనలో తనకే తెలియని అన్నిరకాల అందాలను అతడు చూడగలగాలి! తాను ఎప్పుడూ అతనికి క్రొత్తదనాన్ని ఇచ్చే ఆకర్షణ కావాలి! తాను అతనికి తొలగిపోని మైకం కావాలి!

అలా కావాలంటే.. అతడు జీనియస్ అవ్వాలి!!

..నేను ఇలా ఆలోచనల్లో ఉండగానే "ఏంటండీ! మీరు కూడా నన్ను అలా తాగేసేలా చూస్తున్నారు?"అన్నాడు.

అతని మాటలకు నేను కాస్తా సిగ్గుపడుతూ.."ఏం లేదండీ! ఒకవేళ నేను కూడా మీలా తీవ్రఏకాగ్రతలలో పడితే మీరెలా ఉంటారా?..అంటూ అలోచిస్తున్నా!" అన్నాను

అతడు సంతోషంగా నవ్వి.."అంటే ఒప్పుకున్నారా? నా ప్రేమని!..మన పెళ్ళాయ్యాకే కదా నువ్వడిగింది?!" ..అంటూ అడిగేసరికి..

అప్పుడర్థమైంది!.. నా మాటల్లో తెలియకుండానే ఆ భావం వచ్చేసిందని!!..నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడుతాను!..అయినా ఆ భావం వచ్చేసింది!!
నేను చెప్పాలనుకోకున్నా వచ్చేసిన ఆ భావాన్ని అతడు గమనించాడేమో..మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇలా అన్నాడు.

"ఒకవేళ మీరు కూడా అలా ఉంటే అది చాలా సంతోషాన్ని కలిగించే విషయమే నాకు!
ఏదోఒక ప్రయోజనాన్ని కలిగించే..తాను ప్రేమించే విషయాల్లో తీవ్రఏకాగ్రత కలిగి ఉండాలనే కోరుకుంటాను నేను.

అయినా స్పృహలేని తీవ్ర ఏకాగ్రత కాదు నాది!
కాన్సియస్ తో కూడిన తీవ్ర ఏకాగ్రత.

ఖచ్చితంగా చేయవలసిన పనుల గూర్చి ముందుగానే ప్లాన్ చేసుకుంటాను కాబట్టి అక్కడ ప్రాబ్లమ్ ఉండదు.

ఒకవేళ మీరు ప్రేమించే విషయాల్లో తీవ్ర ఏకాగ్రతలో లీనమైతే మీకు సపోర్ట్ గా ఉంటాను!..
సాధారణంగా ఇలాంటి ఏకాగ్రత ఆనందంతో పాటు ఏదో ఒక ఆవిష్కరణకు కూడా కారణమౌతూవుంటుంది!

ఇక మీరు రిలాక్స్ కోసం ఆటవిడుపు ఏకాగ్రతలలో లీనమైతే నాకు సూటయ్యేవైతే భాగం పంచుకుంటాను.
సూట్ కానివి అయితే మిమ్మల్నే గమనిస్తూ ఆనందపడతాను!

ఒకవేళ ఎక్కువకాలం మీరు ఆ రిలాక్స్ విషయాల్లోనే లీనమైతే మిమ్మల్ని ఆటంకపరుస్తాను కావచ్చు!

మీరు ఒప్పుకుని మనం పెళ్లి చేసుకుంటే మీరు కూడా నా పట్ల చేయవలసింది కూడా ఇదే!"..

అయినా కొన్ని విషయాలు ముందుగా ఊహించడం కష్టం! సంఘటనలు ఎప్పుడూ మనం ఊహించినట్లు జరగక పోవచ్చు కూడా!

ఒకరిపట్ల ఒకరు నమ్మకం,ప్రేమ,స్వచ్ఛత అనేవి కలిగివుంటే అన్నిటికీ అదే పరిష్కారం దొరుకుతుంది."..అన్నాడు విరించి ఆలోచిస్తూనే..

వాతావరణం కాస్తా గంభీరంగా మారినట్లు అనిపించింది.

తేలిక పరచాలన్నట్లుగా "సిగరెట్లు బాగా తాగుతారా?" అన్నాను.

"అవును! రోజూ 4,5 తాగుతుంటాను!..ఇక్కడికి అమెరికా వచ్చాకే అలవాటైంది చలి బాధకి!..ఇక్కడ కామన్ అది.ఆడవాళ్లు కూడా తాగుతుంటారు..మీరు చూసే ఉంటారు.."అన్నాడు.

"అయితే మీకో నిగ్రహపరీక్ష పెడతాను!
ప్రేమించేవ్యక్తి కోసం ఏ సుఖాన్నైనా త్యాగం చేయగలరట కదా!
నాకోసం సిగరెట్ మానెయ్యండి!!" అన్నాను ఛాలెంజ్ విసిరినట్లుగా..

నా మనస్సులోని ఈ అసలు పాయింట్ ను చెబుతున్నప్పుడు నా ఫీలింగ్స్ కనిపించకుండా ఉండడానికి ఆ కొబ్బరివక్క నుండి కొబ్బరిని వేరు చేయడానికా అన్నట్లు నేలకేసి మెల్లగా కొట్టసాగాను!

"ఓ! తప్పకుండా మానేస్తాను!..కానీ నేను పెట్టె నిగ్రహపరిక్షలో మీరు పాసైతే.."..అన్నాడు నవ్వుతూ..

ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే చెప్పిన ఆ జవాబు విని "ఏం పరీక్షా?" అంటూ అడిగాను ఆసక్తిగా

"మీరొక 10 రోజుల పాటు కేవలం పాలకూర మాత్రమే తిని ఉండండి!!" అన్నాడు కొంటెగా...

నేనూహించని ఆ ప్రశ్న విని "దారుణం!!అలా ఉండగలరా? ఎవరైనా!!"అన్నాను..

"అయితే మీ పరీక్ష కూడా దారుణమే!" అన్నాడు.

తర్వాత అతనే..

"మా అబ్బాయిలు మిమ్మల్ని ఉన్నదున్నట్లుగా స్వీకరిస్తాము! మీరేమో మమ్మల్ని మారుమంటారు! మారటాన్ని నేర్పిన మీరే..మళ్ళీ మీరు పూర్తిగా మారిపోయారండీ!!.అంటారు!" అన్నాడతను సెటైర్ వేస్తూ...

"అవునండీ! మిమ్మల్ని మా హృదయంగా భావిస్తాం! అలా మార్చుకోవాలనుకుంటాం! ఆ హృదయం సరిగ్గా పనిచేయనప్పుడు జీవించడం కష్టమౌతుంది కదా??" అన్నాను అతని సెటైర్ కు జవాబిస్తూ...

"అమ్మో!నేనూహించిన దానికన్నా పెద్ద మాటకారివే!!..
సెటైర్ విని ఫీల్ కాకుండా తిరిగి అందంగా జవాబియ్యడం అందరికీ రాదు!..
హాస్యం తెలిసిన వారి జీవితం ఆహ్లాదంగా ఉంటుంది!"..అంటూ నా చేతిలోని కొబ్బరివక్క పగలగొట్టి కొబ్బరిముక్కలను నా చేతికి అందిస్తూ..

"సంహితా! నన్నూ..నా ప్రేమని నమ్ము!
నీ వీరమాచినేని భాషలో చెప్పాలంటే...

"నా ప్రేమ ఆడించిన కొబ్బరి నూనె అంత స్వచ్ఛమైనది ప్రియా!!.." అన్నాడతను నాటకీయంగా!!

ఊహించని విధంగా అతడన్న డైలాగ్ విని ఎంతగా నవ్వానంటే..నవ్వుతుంటే కళ్ళవెంబడి నీళ్లొచ్చాయి!

ఈ వీరమాచినేని డైట్ లో కొబ్బరినూనెకు ఒక ప్రత్యేకత.

అలా నవ్వుతున్న నన్ను చూసి..

"నిమ్మపండు ఛాయతో
బండ ఉప్పులాంటి తెల్లనిపలువరుసతో
ఆలివ్ లా మెరిసే నీ నవ్వులో
పన్నీరు కురుస్తుంటే..
బటర్ లా కరిగిపోతాను!
నువ్వు తోడుంటే....
మూడు పిస్తాలు ఆరు బాదాములులా
మారుతుంది మనజీవితం!!"..అన్నాడు కవితాత్మకంగా!!వీరమాచినేని భాషలో

"చీ!ఆపండి! మీ దిక్కుమాలిన పోలిక!!ఆ భాషేమిటి!! బండ ఉప్పులాంటి పలువరుసనా?..చీ! చీ!!"..అన్నాను ఇంకా నవ్వుతూనే!!

"ఏం చెయ్యాలి మరి!..ఇలా నిగ్రహపరీక్షలు పెడితే..అందుకే నువ్వు ఫాలో అవుతున్న డైట్ భాషలో చెప్పాను!!"..అంటూ అతను చెబుతున్నప్పుడే..

నేను టైం చూసి 11 అవుతుంది.. మనం మీటింగ్ కు వెళ్ళాలి కదా? అన్నాను.

"అవును! ఈరోజు డాక్టర్ పాల్ మోడ్రిచ్ గారి స్పీచ్ ఉంది కదా!..వెళ్ళాలి పదా!!" అన్నాడు.

ఆదివారాలు అప్పుడప్పుడు ఇలా ప్రఖ్యాత సైంటిస్టుల ఉపన్యాసాలు ఉంటాయి. నోబుల్ ప్రైజ్ తీసుకున్న డాక్టర్ పాల్ మోడ్రిచ్ గారి స్పీచ్ ఈ రోజు.

తర్వాత ఎవరి కారులో వాళ్ళం వెళ్ళాము! మళ్ళీ కలుద్దాం అని సెలవుతీసుకుంటూ...

వచ్చేటప్పుడు చివరగా "ఒకవేళ నేను మీ ప్రపోజ్ ఒప్పుకోకుంటే?"..అడిగాను.

"నిజానికి నాకు పెళ్లిపై ఆలోచనే లేదు..జీవితమంతా నా సబ్జెక్టు కోసమే కేటాయిద్దామనుకున్నాను! మిమ్మల్ని చూశాకే నాకు పెళ్లి చేసుకుందామనే ఆలోచన వచ్చింది.మీరు ఒప్పుకోకుంటే నేనేం ఒంటరివాన్ని కాదుగా!! నేను ప్రేమించే కెమిస్ట్రీ ఉంది!!..ఇక పూర్తి సమయం దానికే!!"..అన్నాడు కారులో కూర్చుంటూ...

**************************

నేను కన్ఫామ్ చేయలేదు కానీ,విరించికి అర్థమైంది..నేను తనని ఇష్టపడుతున్నాననే విషయం.

అప్పుడప్పుడు మాత్రం వాట్సాప్ లో చాట్ చేసుకుంటూ ఉన్నాం!

విరించిని కలిసి ఐదురోజులు గడిచిపోయింది...

ఆరోజు శుక్రవారం..

నిత్యతో కలసి అవసరమైన కొన్ని వస్తువులు షాపింగ్ చేద్దామని మా ల్యాబ్ బిల్డింగ్ కు ఎదురుగా ఉన్న చిన్న రోడ్ లో నడుస్తూ వెళుతున్నాం!

అకస్మాత్తుగా నల్లగా నీగ్రోలా ఉన్న ఒక బలిష్టమైన వ్యక్తి మా వద్దకు వచ్చాడు.

నిత్యకి రివాల్వర్ గురిపెట్టి చేతిలోని బ్యాగ్..బంగారుచైన్,బ్రాస్లెట్ ఇవ్వుమన్నాడు!

నిత్య కాస్తా తటపటాయించేలోపే రివాల్వర్ తో షూట్ చేశాడు.బుల్లెట్ నిత్య భుజంలో దిగింది..
మేము భయంతో అరిచాము!
నేను నిత్యను పట్టుకుందామని వెళ్ళాను..వాడు బలంగా నన్ను విసిరేసినట్లుగా తోసి నిత్య బ్యాగ్ లాక్కుంది మాత్రమే గుర్తుంది.

వాడు నన్ను విసిరేయడంతో నేనెళ్లి అక్కడున్న స్తంభానికి కొట్టుకున్నాను..నా తలపై నుండి ముఖం మీదుగా రక్తం కారసాగింది!..వెంటనే నాకు స్పృహ తప్పింది.

***************************

నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా విరించి ఉన్నాడు.

చూస్తే హాస్పిటల్ బెడ్ పై ఉన్నట్లుగా గమనించాను!

"నిత్యాకి ఎలావుంది?"అడిగాను నీరసంగా..

"పర్వాలేదు! భుజంలో దిగిన బుల్లెట్ తీసేశారు..వాళ్ళ అమ్మానాన్నలు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు!..
"సంహితను ఒంటరిగా వదిలి ఎలా నాన్నా?ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా!" అని నిత్య అంది..
"పర్వాలేదు! నేను చూసుకుంటాలే!"..అంటూ నేను హామీ ఇచ్చాక వెళ్ళింది."..అంటూ చెప్పాడతను.

"ఎప్పుడు డిస్టార్జ్ చేస్తారట! ఎన్ని రోజులైంది??"అడిగాను మళ్ళీ.

"నిన్న శనివారం సాయంత్రం మీకు ఇలా జరిగింది. ఈరోజు ఉదయం నిత్యా వాళ్ళు వెళ్లిపోయారు.. మిమ్మల్ని ఈ రాత్రికే డిశ్చార్జ్ చేస్తారు!..మనం ఇంటికి వెళ్లిపోవచ్చు!" చెప్పాడు విరించి..

"మా అమ్మానాన్నలకి ఫోన్ చేయలేదు కదా?" అడిగాను..

"నిత్య ఫోన్ చేసి చెబుదామనుకుంది!..కానీ అక్కడ వాళ్ళు ఆందోళన పడతారని చెప్పలేదు.
మరికొంచెం బలంగా తాకుంటే ప్రాబ్లమ్ అయ్యేది!..మీ భుజంకు కూడా బలంగానే దెబ్బతాకింది..డిస్లోకేషన్ అయితే సెట్ చేశారు..ఒక వారం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది!"..చెప్పాడతను.

ఆ రాత్రికే డిశ్చార్జ్ చేశారు..మా ఇంటికి వచ్చేశాము!..విరించి కూడా ఉండడం కాస్తా మోహమాటంగానే ఉన్నా తప్పలేదు.

ఆ వారంరోజులు విరించి కూడ ల్యాబ్ కు వెళ్ళలేదు.
ఎంత సర్వీస్ చేశాడో చెప్పలేను..
తలకి తాకిన దెబ్బకన్నా భుజంకు తాకిన దెబ్బే నన్ను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టింది!..

విరించితో సేవలు చేయించుకోవడం తప్పలేదు..
ఒక రెండురోజుల తర్వాత గమనించి అడిగాను..

"మీకు సిగరెట్ తాగడం అలవాటు కదా? తాగడం లేదేంటీ??"..అంటూ

"మీకిలా జరిగిందని తెలిసాక మన ల్యాబ్ వాళ్ళము కొందరం పెరిగెత్తుకుంటూ వచ్చాము..నిత్య భుజం నుంచి..మీ తల నుండి రక్తం కారుతూనే ఉంది.నువ్వు స్పృహలో లేవు..మెదడుకు ఏమన్నా అయ్యిందా? అనే అనుమానం ఒకటి!నిత్య తన భుజం బాధ..నీ పరిస్థితి చూసి ఏడుస్తూనే ఉంది. హాస్పిటల్లో జాయిన్ చేశాక డాక్టర్ల అన్ని పరీక్షలు చేశారు.. ప్రాబ్లమ్ ఏమీ లేదని చెప్పాకే మనస్సు కుదుటపడింది.

ఆ సమయంలో సిగరెట్ కూడా గుర్తు రాలేదు...అప్పుడు మరేదీ రిలాక్స్ ఇవ్వలేదనిపించింది..నీకు బాగై కోలుకుంటే చాలనిపించింది!

అప్పటినుంచి సిగరెట్ మీద కోరిక పోయింది!"...అంటూ వివరించాడతను.

నా మనస్సుకు ఎంత సంతోషం వేసిందో చెప్పలేను.

నాకు ఇష్టంగా సర్వీస్ చేస్తూ ఎంత కష్టమైనా భరించాడు..
రెండు రోజులు నిద్రలేని రాత్రులు కూడా గడిపాడు...
ఇద్దరమే ఉన్నా,భుజం ప్రాబ్లమ్ వల్ల నేను డ్రెస్ మార్చుకునే సందర్భంలో హెల్ప్ చేసేటప్పుడు కొంచెం కూడా నేను ఇబ్బంది పడేలా ప్రవర్తించలేదు.

అవకాశం దొరికినా కామదృష్టి ప్రదర్శించలేదు!

నా స్నేహితుల్లో కామాన్నే ప్రేమగా బ్రమపడే చాలామందిని చూశాను..

కామం పశువుకు కూడా ఉంటుంది!
కానీ..నిగ్రహం మనిషికే ఉంటుంది!!

ప్రేముంటే అదే నిగ్రహాన్ని నేర్పుతుంది.. అనిపించింది.

చివరకు చిన్నప్పటి నుంచి నేను మోస్తున్న భావం బరువు దింపేసుకున్నాను!!

విరించి మీద నాకింకే సందేహాలు కలగలేదు.

ఇంటికి వచ్చాక మూడవరోజు నిత్య ఫోన్ చేసింది.విషయాలు తెలుసుకుని "ఇంకేంటి?పెళ్లి కాకముందే మొగుడితో సేవలు చేయించుకుంటున్నావు?"..అంది.

అది ఆ మాటంటే నాకు సిగ్గుతో పాటు ఆనందం కూడా కలిగింది.

తర్వాత మా అమ్మానాన్నలకి విరించి విషయం చెప్పాను.మా అమ్మకి వాళ్ళ కుటుంబం పరిచయమేనట! సంతోషంగా ఒప్పుకున్నారు.

తర్వాత మా పెళ్లి జరిగి పోయింది!

మొదటిరాత్రి విరించి

"నీ పెదవులపై "పొటాషియం, అయోడిన్, రెండు సల్ఫర్ ల " మిశ్రమాన్ని ఉంచనా?"..అంటూ అడిగాడు..

అంటే రసాయన సాంకేత నామాల ప్రకారం KISS అవుతుంది.

ఆ మాటలకు నేను.."వద్దులెండి! అవి ల్యాబ్ లోనే ఉంచి ఇక్కడ మాత్రం LIPS నే ఉంచండి ఎప్పుడూ!!" అన్నాను.

అంత డైరెక్టుగా చెబుతున్న నన్ను కాస్తా ఆశ్చర్యంగా చూస్తుంటే..

L అంటే LOVE (ప్రేమ)
I అంటే INTIMACY (సాన్నిహిత్యం)
P అంటే PURITY ( స్వచ్ఛత)
S అంటే SECURITY (భద్రత)

....అంటూ చెప్పాను.

నా మాటలు విని అతను.."ఒక్క లిప్సే (LIPS) కాదు ..హగ్(HUG) కూడా ఇస్తాను"..

HUG అంటే Happiness
Understanding
Graceful
.............అంటూ బదులిస్తూ అన్నాడు.

అతడెప్పుడూ అంతే!
మాటలకు తడుముకోడు!వెంటనే సమయస్ఫూర్తితో బదులిస్తూ అల్లుకుపోతుంటాడు!
అందులో అతని రసికత,తెలివి,ఉత్సాహం,నేనంటే ఉన్న శ్రద్ధ, సెన్సాఫ్ హ్యూమర్..ఇలా అన్నీ కనిపిస్తుంటాయి నాకు!

ఎప్పుడో అడపా దడపా వచ్చే విజయాలు కొంతకాలం మాత్రమే ఆనందంగా ఉంచుతాయి!..కానీ..రోజూ ఇలాంటి మాటలు,చర్యలు,ఆ ఉత్సాహం.. జీవితభాగస్వామికి ఉంటే ఎప్పుడూ ఆనందమే!

అతడిలా నా మాటలకు అల్లుకుపోవడం చూశాక...

"ఒకరినొకరు అల్లుకుపోవడమే దాంపత్యం!!
...అవగాహన చేసుకుంటూ!!!"..అనుకున్నాను అతన్ని అల్లుకుపోతూ !!

****************************

ఇక్కడితో మా ప్రేమకథ అయిపోలేదు!
పెళ్ళికిముందు మా ఇద్దరిమధ్య ప్రేమకథ అయితే..పెళ్లి తర్వాత మా జీవితాలకు సార్థకత ఇచ్చిన ప్రేమకథ ప్రారంభమయ్యింది...కెమిస్ట్రీతో!!

కెమిస్ట్రీ రంగంలో మాకు మంచి సైంటిస్టులుగా గుర్తింపు వచ్చింది!

పరిశోధన చేయడానికి అనుకూలంగా స్వంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాము!

ఓరోజు నేను ప్రాచీన భారతదేశంలో రసాయన పరిశోధనల గూర్చి చెబుతూ ఆచార్య నాగార్జనుని పరిశోధనల గూర్చి చెప్పాను.

అతడు పాదరసాన్ని(మెర్క్యూరిని) బంగారంగా మార్చాడన్న విషయం చెప్పాను.

"అవును! అలా మార్చవచ్చు!! ఒకే ఒక ఎలక్రాన్, ప్రోటాన్ మాత్రమే తేడా! వాటిని తీసేస్తే పాదరసం బంగారంగా మారుతుంది!.కానీ,ఇప్పుడున్న పరిశోధనల ప్రకారం అది ఖర్చుతో కూడిన పని."అన్నాడు విరించి.

"మనం దాన్ని చాలా తక్కువ ఖర్చుతో సులభంగా మార్చగలిగే విధానం మీద దృష్టి పెడదాం!" అన్నాను నేను.

"నిజానికి నేను హైడ్రోకార్బన్స్ పై పరిశోధన చేసి తక్కువ ఖర్చుతో పెట్రోలియంను కృత్రిమంగా తయ్యారుచేయడానికి అవకాశాలు గూర్చి చూద్దామనుకున్నాను! మనదేశ ఆదాయంలో ఎక్కువ భాగం దానికే ఖర్చు అవుతుంది.. దీనికి పరిష్కారం కనుక్కుని మనదేశ రుణం తీర్చుకుందామనుకున్నాను!కానీ అది చాలా సంవత్సరాల ప్రాజెక్ట్.సక్సెస్ అవుతామో కామో తెలియదు!
నువ్వు చెబుతుంటే ఈ బంగారం విషయమే ముందేసుకుందామనిపిస్తుంది!" అన్నాడు విరించి.

అలా మా పరిశోధన ప్రారంభమైంది.
ఒక 5సంవత్సరాల తర్వాత మా ప్రయోగం ఫలించిందనుకున్నాం!..కానీ ఆ పాదరసం థాలియం గా మారిపోయింది!

"..మన ప్రయోగంలో ఒక ఎలక్రాన్, ప్రోటాన్ పెరిగింది.మనం ఒక పదార్థాన్ని దానికన్నా ఒక పరమాణుసంఖ్య ఎక్కువగా మార్చగలం ఇప్పుడు తక్కువ ఖర్చుతో!"..అన్నాడు విరించి.

దగ్గరదాకా వచ్చి మిస్సైనందుకు చాలా నిరుత్సాహపడ్డాం!
మళ్ళీ మరింత పట్టుదలగా పరిశోధన చేశాము.చివరకు మరో రెండు సంవత్సరాల తర్వాత విజయం సాధించాం!!

"మన పరిశోధన పత్రాన్ని ప్రచురిద్దాం! ఈ విషయం సంచలనం సృష్టిస్తుంది..నోబెల్ కూడా రావచ్చేమో!".. అన్నాను నేను.

"మనం కనుక్కున్న విషయం వల్ల బంగారం రేటు పూర్తిగా పడిపోతుంది!..ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కారణమౌతుంది..ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు!
మొదట మనం కనుక్కున్న విషయాలు మనదేశానికి ఉపయోగ పడేలా చేద్దాము.

అది రెండురకలుగా చెయ్యచ్చు!
మనమే ఒక ట్రస్ట్ పెట్టి అభివృద్ధి చేస్తూ వెళ్లడం!
లేదా ప్రధాన మంత్రిని కలసి మన పరిశోధన వివరించడం!!
ఏం చేయాలన్నది వెళ్ళాక నిర్ణయించుకుందాం!!

ఇక మంచి చెడులు కొన్ని సంవత్సరాలపాటు అధ్యయనం చేసి ప్రపంచానికి ఈ ఫార్ములా ప్రకటిద్దాం!'..అన్నాడు విరించి.

తర్వాత అమెరికాలో ఉన్న ఆస్తులన్ని అమ్మేసి ఇండియా బయలుదేరాం!..దేశ రుణం తీర్చుకొనేందుకు!!

ఫ్లయిట్ లో వస్తున్నప్పుడు అనుకున్నాను!

బహుశా ఈ కారణంతోనే భగవంతుడు మమ్మల్ని భార్యాభర్తలుగా కలిపి ఉంటాడేమో అని!!

**************************

ఈ భారీ కథను ఓపికగా చదివినవారికి
ధన్యవాదములతో..
గురుమంచి రాజేంద్రశర్మ.
 

Top