Non-Erotic ఒకే సంఘటన - వేరువేరు అనుభూతులు - ఒక ఆలోచనాత్మక కథ

Member
227
229
18
ఒకే సంఘటన - వేరువేరు అనుభూతులు - ఒక ఆలోచనాత్మక కథ
రచన :- గురుమంచి రాజేంద్రశర్మ


రమణి ,వసంతలు ఇరుగుపొరుగే కాకుండా చాలా ఫ్రెండ్లీగా వుంటారు.
వారి భర్తలు కూడా ఒకే ఆఫీస్ లో పని చేస్తుంటారు!

తమ తమ భర్తలు ఆఫీస్ కు వెళ్ళాక మధ్యాహ్నం ఇద్దరు కలిసి ఎప్పటిమాదిరిగానే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు!

"నిన్న ఎలా గడిచింది వసంత ?" అడిగింది రమణి.

"చాలా దరిద్రంగా గడిచిందే! ఆయన ఆఫీస్ నుండి వచ్చారా! ఎన్నడూ లేనిది .. కనీసం రెగులర్ గా చూసే టీవీ సీరియళ్లను కూడా చూడనీయకుండా ఒకటే మాట్లాడుతూ ఉన్నారు! పోనీ ఏదో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషించే దాన్ని!

అన్నీ చెత్తవిషయాలు..ఆఫీస్ విషయాలు..ఏవరెవరో ఆయన ఫ్రెండ్స్ బాధలు..రాజకీయాలు.. ఉదయం పేపర్లో వచ్చిన హత్యల విశేషాలు..ఎవరెవరికి డబ్బులిచ్చేది ఉందో అప్పుల వివరాలు..అవీ ఇవీ ఏవేవో చెబుతూనే ఉన్నారు!
మనసంతా ఏడారిలా ఐపోయిందే!! బిక్క చచ్చిపోయాను!
ఛీ! మా ఆయనకి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు..ఎప్పుడూ ఇలా చేయలేదు.నిన్ననే ఫస్ట్." నిన్నటి తన అనుభవాన్ని వివరించింది వసంత.

"మరి! నీ సంగతి??" అడిగింది వసంత రమణిని

"నిన్నటి రోజు నా జీవితంలోనే అద్భుతమైన రోజే వసంత! మా ఆయన ఆఫీస్ నుండి వచ్చారా! రాగానే .."రమణీ! ఈ రోజు చాలా స్పెషల్ గా గడుపుదాం!"అన్నాడు.

ఆయన ఉషారు చూసి " ఎలా అండీ!" అంటూ అడిగాను.

"నో కరెంట్ డే! అంటే రేపు ఈ సమయం వరకు కూడా కరెంట్ అసలే ఉపయోగించకుండా!!"

"వింటుంటే చాలా వెరైటీగా అన్పిస్తుందండీ! సరే!!" అన్నాను ఉత్సాహంగా..

ఆయన వెళ్లి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చారు!

"నేను కొద్దిగా షాపింగ్ చేసేది ఉందండీ!" అంటే..ఈ రోజు బండి కూడా వద్దన్నారు..అలా ఇద్దరం కలిసి చాలా దూరం నడిచి మాట్లాడుకుంటూ షాపింగ్ చేసుకుని వచ్చాము.

తర్వాత దాబాపైన క్యాండీల్స్ పెట్టుకుని డిన్నర్ చేశాము..నిన్నటి రోజు నా జీవితంలో అద్భుతమైనదే కాదు మధురమైన రోజు కూడా!ఎంత వర్ణించినా తక్కువే!!"అంటూ తన అనుభవాన్ని చాలా ఉత్సాహంగా వివరించింది రమణి.

✴️✴️✴️✴️✴️

ఆఫీస్ వెళ్లిన వసంత,రమణి భర్తలు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఖాళీ సమయంలో మాట్లాడుకుంటున్నారు.

"నిన్న ఇంటికి వెళ్లి ఏంచేశావ్?" అడిగాడు రమణి భర్త.

" నిన్నటి రోజు అద్భుతం..నా మనసంతా చాలా సంతోషంగా అనిపించింది.

మా వసంత నాతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడవు..ఏ విషయాలు చెప్పరూ! అంటూ వుంటుంది.

ఉదయం ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నేను మారాలని నిన్ననే డిసైడ్ అయ్యాను!

ఇంటికి వెళ్లి మొత్తం అమెతోనే గడిపాను! నా ఆర్థిక విషయాలు కూడా మనుసువిప్పి చర్చించాను! రాజకీయంగా నా దృక్కోణం.. కష్టసుఖాలను ఎదుర్కొనే విషయంలో నా పరిశీలన...దేశంలోని ,సమాజంలోని విషయాలు..వాటిపట్ల నా అవగాహన ఇవన్నీ ఒక ఫ్రెండైన నీతో ఎంత ఫ్రీగా మాట్లాడుతానో అంత ఫ్రీగా వసంతతో కూడా మాట్లాడాను!

అన్ని విషయాలపట్ల నా నాలెడ్జ్..అవగాహన చూసి వీస్తుపోయి అలా ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది.ఇన్ని రోజులు తనతో మాట్లాడక ఎంత తప్పుచేశానో అర్థమైంది!"అంటూ తన అనుభవాన్ని ఉత్సాహంగా వివరించాడు వసంత భర్త.

"మరి! నీ సంగతి?" తిరిగి ప్రశ్నించాడు వసంత భర్త తన ఫ్రెండుని.

" చాలా దరిద్రంగా గడిచింది!

ఆఫీస్ లో ఉన్నప్పుడే లైన్ మెన్ ఫోన్ చేసి కరెంట్ బిల్ కట్టనిదానికి కరెంట్ డిస్కనెక్ట్ చేసాను. రేపు బిల్ కడితే తిరిగి కనెక్షన్ ఇస్తానని చెప్పాడు!

నీకు తెలుసుకదా ! మా చెల్లి హాస్పిటల్ లో ఉంటే హెల్ప్ చెయ్యాల్సి వచ్చింది.జీతం డబ్బులు చాలా వరకు అటే ఖర్చు పెట్టాల్సి వచ్చింది.రమణికి మా చెల్లి అంటే పడది కాబట్టి ఈ ఖర్చు సంగతి రమణికి చెప్పలేదు.

ఇక ఇంటికి వెళ్లి ఈ పరిస్థితి నుండి ఎలా గట్టెక్కలా? అని ఆలోచించి "నో కరెంట్ డే!" అని ప్లాన్ చేసి ఎలాగోలా గడిపాను.

పిడుగు పడినట్లు రమణి ఏదో షాపింగ్ చేస్తా! అంది.చిన్న ఐటమ్ పేరు చెప్పడం వల్ల ధైర్యం చేసి బయలుదేరాను!

బండి మీద వెళదామంటే..అందులో కేవలం ఈ రోజుకు సరిపడే పెట్రోలే ఉంది. వాకింగ్ నెపంతో చాలా దూరం నడవాల్సి వచ్చింది.మొదలే ఆఫీస్ లో పని వల్ల అలసిపోయానా! మళ్ళీ ఈ వాకింగ్..

ఇంటికి వెళ్లి ఉక్కపోతలో భోజనం చెయ్యలేక ఆ వంటలు ఆమెతో పాటే మోసి డాబా పై క్యాండీల్స్ పెట్టుకుని తినాల్సి వచ్చింది.తిరిగి అవన్నీ మోసుకురావడం..అబ్బా! గుర్తుకొస్తుంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోవద్దు! ముందే జాగ్రత్త పడి అప్పైనా డబ్బులు సిద్ధంగా ఉంచుకోవాలి..అన్పించింది.

ఈ రోజు ఉదయమే అప్పు తీసుకొచ్చి లైన్ మెన్ ను కలిసి కరెంట్ బిల్ విషయం సెట్ చేసి ఆఫీస్ వచ్చాను" అంటూ నిన్నటి తన అనుభవాన్ని విచారంగా వివరించాడు రమణి భర్త.

✴️✴️✴️✴️✴️

ఆ సమయంలో మన మనసును బట్టే మన అనుభూతులు..అనుభవాలు ఉంటాయి!

ఒకే సంఘటన ఇద్దరికీ వేరువేరు అనుభూతులను..అనుభవాన్ని ఇవ్వవచ్చు!

ఆనందాలు..కష్టాలు..అనుభూతులు..అనుభవాలు..అన్నీ వ్యక్తిగతమే!ఎవరి మనసును బట్టి వారికే తెలుస్తుంటాయి!

భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని చాలామంది అనుకుంటారు! బహుశా అది అసాధ్యం కూడా కావచ్చు!

నిజం చెప్పాలంటే...

భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోవడం కంటే కూడా నమ్మకాన్ని కలిగి ఉండడమే ముఖ్యం.

అర్థం చేసుకోవడం కష్టసాధ్యమే కాక అసమగ్రం కూడా! పరిస్థితిని బట్టి..జ్ఞానాన్ని బట్టి..అనుభవాన్ని బట్టి.. కర్మనూ- కర్మఫలాలను బట్టి మనిషి నిరంతరం మారుతూనే ఉంటాడు.

అంతే కాదు...
అర్థం చేసుకోవడంలో ఆ వ్యక్తి లాగే 50% పాజిటివ్ నెస్..50% నెగిటివ్ నెస్ ఉంటుంది.

"నమ్మకం " అనేది చాలా సులభం..సమగ్రమైనది... ఇందులో 100% పాజిటివ్ నేసే ఉంటుంది.


ఒకరినొకరు అర్థం చేసుకోవాలని కోరుకుంటే దాంపత్య సౌఖ్యం రావచ్చు! రాకపోవచ్చు!! 50% మాత్రమే అవకాశం.

కానీ...

ఒకరిపట్ల ఒకరు నమ్మకాన్ని కలిగేలా తమ తమ ఆటిట్యూడ్ ను ( ప్రవర్తనను) మార్చుకుంటే ఖచ్చితంగా అంటే 100% దాంపత్యసౌఖ్యం ఉంటుంది.

అలా ఏర్పడ్డ "నమ్మకం" ఒకరినొకరు "ఎక్సెప్ట్ చేసేలా చేస్తుంది!!తమ పిల్లలు ఎలా ఉన్నా ఎక్సెప్ట్ చేసినట్లుగా!!"

చివరగా మరొక్క మాట!

ఏ వ్యక్తైనా " తనను తాను అర్థం చేసుకోవాలి!"
"భాగస్వామి పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి!!"


తన అనుభవాలను.. ఆవేశాలను..అభిప్రాయాలను.. కర్మలను..కర్మఫలాలను..చివరగా తననూ.. అర్థం చేసుకోవడం మానేసి వాటినే సత్యం అని ఎప్పుడు నమ్మడం మొదలు పెడుతారో అప్పుడే సంఘర్షణ ప్రారంభమౌతుంది.

అలాగే

ఎప్పుడైతే భాగస్వామిని నమ్మడం మానేసి.. ఆ భాగస్వామి తనని అర్థం చేసుకోవాలని కోరుకోవడం మొదలు పెడుతారో అప్పుడే సంఘర్షణ ప్రారంభమౌతుంది.

ఇద్దరిమధ్య ఏర్పడ్డ బంధమే నమ్మకానికి పునాది! ఆ నమ్మకమే అన్నిటిని అవగతపరిచి అవగాహన చేయిస్తుంది!

తనని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్న చోట బంధం బలహీనంగా ఉందన్నమాటే!!

తల్లి..తండ్రి..అన్న.. తమ్ముడు.. అక్క..చెల్లి..భార్య..భర్త..పిల్లలు.... బంధాలు బలహీనమౌతున్నా కొద్దీ నమ్మకం సడలుతూ బలహీన పడుతున్న బంధం వైపు నన్ను అర్థం చేసుకోండీ అంటూ మనుసు ఆక్రోశిస్తూ ఉంటుంది..

తనని తాను సరిగ్గా అర్థం చేసుకోలేని వారే..కనీసం వారికైనా అర్థం కావచ్చేమోనని "తనని అర్థం చేసుకోవాలని" కోరుకుంటారు!

నమ్మడం లేదా?
తన తల్లి ఏడుస్తూ వుంటే మూడు సంవత్సరాల బాబుకూడా వెళ్లి కన్నీళ్లు తుడుస్తాడు!
వాడికి తల్లిని అర్థం చేసుకునే జ్ఞానం ఉందనా? కాదు..బంధం..నా తల్లి అనే నమ్మకం అంతే!!!
అది బలంగా వుంటే చాలు! అన్నీ అవే అర్థమైపోతాయి!

ప్రేమను ప్రత్యేకంగా అర్థం చేసుకునే అవసరమే లేదు.అనుభవిస్తూ అనుభూతి చెందితే చాలు అంతా అదే అవగతమౌతుంది!

చక్కెర రుచిని అర్థం చేసుకుందామని ఎంత ఆలోచించినా ఏమీ తెలియదు! అనుభవిస్తే చాలు! దాని ఉనికి ..రుచి..ఆనందం మూడూ ఒక్కసారే కలిగి..కరిగి అనుభవిస్తున్న వ్యక్తిలో ఒక అనుభూతిగా లీనమౌతాయి!
ప్రేమ..బంధం కూడా అంతే!!

?????

ఓపికగా చదివిన వారికి
ధన్యవాదములతో..
గురుమంచి
రాజేంద్రశర్మ.
 

Top