Romance పేరెంటింగ్ స్టైల్ ( ఒక మంచికథ)

Member
227
229
18
పేరెంటింగ్ స్టైల్ ( ఒక మంచికథ)
రచన:- గురుమంచి రాజేంద్రశర్మ

"ప్రేమించడాన్ని తల్లి నేర్పాలి!
ఆలోచించడాన్ని తండ్రి నేర్పాలి!!"

అలాగే

ప్రేమను ప్రకటించేవిధానాన్ని తండ్రి నేర్పాలి!
ఆలోచనను అమలు పరిచే విధానాన్ని తల్లి నేర్పాలి!!"

...అంటూ చెబుతున్న పార్థసారథి మాటలు విని,

"నాన్నా! మీ మాటలు అర్థమైనట్లే ఉన్నా పూర్తిగా అర్థం కాకుండా కూడా ఉన్నాయి.ప్లీజ్ నాన్నా!! కాస్తా వివరించి చెప్పండి"..అంటూ అడిగాడు మహేష్.

సంక్రాంతికి ఊరికి వచ్చిన తన ఇద్దరు కొడుకులు మహేష్,సురేష్ లతో కలిసి సాయంకాల వాహ్యాళికి నడుస్తూ బయలుదేరాడు పార్థసారథి.

నడక ఆపి ఒక పచ్చిక మైదానం లాంటి భాగంలో కూర్చుని కొడుకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చిన్నకొడుకు సురేష్ అడిగాడు తండ్రిని...

"నాన్నా! పిల్లలు పెరిగిపోతున్నారు..వాళ్ళను సరిగ్గా పెంచడం చాలా కష్టంగా అనిపిస్తోంది.. వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యం చదువుకూ..ఉపయోగపడే విషయాలకు ఇవ్వడం లేదు. కనీసం తల్లిదండ్రులతో ఎలా మసులుకోవాలో..చిన్న చిన్న ఇంటిపనులు ఎలా చెయ్యాలో కూడా తెలియడం లేదు..వాళ్లలో మొండితనం బాగా పెరిగిపోయింది నాన్నా! "...అంటూ తన సమస్య చెప్పుకున్నాడు.

సురేష్ మాటలు విని సమాధానంగా చెబుతున్న పార్థసారథి మాటలు వింటున్నప్పుడే పెద్దకొడుకు మహేష్ పై ప్రశ్న వేసి వివరణ కోరాడు.

మహేష్ ప్రశ్న విని పార్థసారథి ఇలా చెప్పసాగాడు.

"అవునురా! నేను చెప్పే విషయాలు చాలా ముఖ్యమైనవి...

ప్రేమించడం..ఆ ప్రేమను ప్రకటించడం అలాగే ఆలోచించడం..ఆ ఆలోచనలను అమలుపర్చడం..ఈ విషయాలు తెలియనప్పుడే లేదా సరిగ్గా నేర్చుకోకుండా ఉన్నప్పుడే పిల్లలు అలా ప్రవర్తిస్తూ ఉంటారు."

ప్రేమించడం తెలిస్తే మనలో అశాంతి తొలుగుతుంది. ప్రేమను ప్రకటించడం తెలిస్తే అనుబంధం గట్టిగా నిలబడుతుంది.

అలాగే ఆలోచించడం తెలిస్తే ఎదుగుదల ప్రారంభం అవుతుంది..వివేకం,విచక్షణతో కూడిన జ్ఞానం వికసిస్తూ పోతుంది.
ఆ ఆలోచనలను అమలుపరచడం తెలిస్తే ఆ జ్ఞానం వాస్తవ రూపంలోకి వచ్చి అభివృద్ధి అనుభవమౌతుంది.

ఇక ప్రేమించడం అనేది స్త్రీలకు స్వాభావికంగా వచ్చిన సహజ లక్షణం.అందుకే అచ్చంగా ప్రేమించడం తల్లి మాత్రమే నేర్పగలదు.

అన్ని వర్ణాలు తెలుపులో ఇమిడివున్నట్లు..లేదా తెలుపు విడిపోయి రకరకాల వర్ణాలుగా మారినట్లు

ప్రేమలో అన్ని భావోద్వేగాలు ఇమిడిఉంటాయి..

కానీ ఆలోచించడం నేర్చుకోకుంటే ఆ ప్రేమను ఎలా ప్రకటించాలో తెలియదు.

మీరు కొంత మంది స్త్రీలను గమనించి చూడండి!

మనసులో ఎంత ప్రేమ ఉన్నా తాను చికాగ్గా ఉంటే ఆ ప్రేమను కోపంగా ప్రకటిస్తారు.

నిస్సహాయతగా.. నీరసంగా ఉంటే ఏడుపు ద్వారా ప్రకటిస్తారు.

ఆమె ఉత్సాహంగా..సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే అది ప్రేమ ప్రేమగా ప్రకటించబడుతుంది.


ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే..

పిల్లల విషయంలో మనసులో ఎంత ప్రేమున్నా అది ముఖ్యం కాదు!

ఇలా మనము రకరకాలుగా ప్రకటించే భావోద్వేగాలే చాలా చాలా ముఖ్యమైనవి.అవి ఆ పిల్లల్లో నెగిటివ్..పాజిటివ్ విత్తనాలు నాటుతూ వెళుతుంటాయి.

పిల్లలు మనం చెప్పే విషయాలు విని నేర్చుకోరు. మనని చూసి అంటే ఆ తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి అనుకరిస్తారు.లేదా నేర్చుకుంటారు.

అందుకే ఒక చిత్రకారుడు ఎక్కడ ఏ వర్ణం సూట్ అవుతుందో ఎలా గమించించి చిత్రాలకు రంగులు అద్దుతాడో అలాగే పిల్లల వ్యక్తిత్వ నిర్మాణ విషయంలో ప్రేమను ప్రకటించేటప్పుడు తగిన విధంగా ప్రేమతో కూడిన భావోద్వేగాలను పాజిటివ్ గా వాడాలి..అదీ స్పృహతో కూడుకుని!!

అలా కాకుండా స్పృహలేకుండా ఇష్టం వచ్చినట్లు రంగులు వేస్తే ఆ చిత్రం చెడిపోయినట్లు...పిల్లల వ్యక్తిత్వం కూడా ఎదగకపోయే అవకాశం ఉంది.

ఒకనిమిషం ఊపిరి తీసుకోవడం కోసమా అన్నట్లు ఆగాడు పార్థసారథి.

తండ్రి మాటలు ఫిలాసఫీ క్లాస్ లా ఉన్నా, తమ పిల్లల్లో పెరుగుతున్న మొండితనం,బాధ్యత తెలియక పోవడం ఇవన్నీ చూసి తండ్రి మాటలు ఏమైనా పరిష్కారం చూపించవచ్చేమో అనే ఆశతో శ్రద్ధగా వింటున్నారు మహేష్,సురేష్ లు.

పార్థసారథి మళ్ళీ చెప్పసాగాడు.

ఇక ఆలోచించడం తండ్రి నేర్పాలి..ఎందుకంటే అది అతని స్వాభావిక లక్షణం.భావోద్వేగాలు అంటకుండా అచ్చంగా ఎలా ఆలోచించవచ్చో ఆ ఆలోచనా విధానాన్ని తండ్రి మాత్రమే నేర్పగలడు.

పిల్లలను గమనిస్తూ కోపం,విసుగు ప్రదర్శించకుండా మంచి,చెడులను విశ్లేషించడం..చిన్న చిన్న కథలు,లెక్కలు,పజిల్స్ ఇలా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా వాళ్లలో ఆలోచనలు వికసించేలా తండ్రి శ్రద్ధ పెట్టాలి!

వాళ్లడిగే ఏ ప్రశ్నలకైనా విసుక్కోకుండా చాలా ఓపికగా సమాధానాలు చెప్పాలి!

నిజానికి వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారంటే ఆలోచించడం నేర్చుకోవడం మొదలుపెట్టారనే అర్థం..

అందుకే వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నా కొద్దీ ఆ తల్లిదండ్రులు ఎక్కువ సంతోషించాలి!

ఇక్కడో విషయం గమనించాలి.

ఆలోచన విధానం వేరు!
ఆ ఆలోచనలను అమలు పర్చడం వేరు!!

నువ్వు ఏ ఆలోచనను అయితే బాగా ప్రేమిస్తావో దాన్నే చక్కగా అమలు పరిచి కార్యరూపంలోకి తీసుకురాగలవు.

అందుకే ఆలోచనను అమలుపర్చడం తల్లినేర్పాలని చెప్పింది.

పేరెంటింగ్ అనేది చాలా లోతైన సబ్జెక్టు రా!!

ఏదో ఉదయాన్నే లేచి హడావుడి పడుతూ పిల్లల్ని లేపి స్కూలుకు పంపి ఆఫీస్ కు వెళ్లి మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చి ఆ సరికే స్కూలు నుంచి ఇంటికి వచ్చిన పిల్లలను హోమ్ వర్క్ చేసుకొమ్మని గదమాయించి మనం మన ఫోన్లలో..లేదా టీవీలలో లీనమైతే..ఆదివారాలు సినిమాకో షికారుకో వెళ్లి వాళ్ళు అడిగినవల్లా కొనిచ్చేసి చేతులు దులుపుకుంటే.... ఆ పిల్లలు పెరుగుతున్నా కొద్దీ వాళ్ళలో నాటుకున్న విత్తనాలు ఇలా మొండితనం రూపంలో..ఇంకా రకరకాల సమస్యల రూపంలో బయటకు వస్తునే ఉంటాయి.

తండ్రి చివరగా చెప్పిన మాటలు విని గతుక్కుమని భుజాలు తడుముకున్నారు మహేష్,సురేష్ లు.

"ఇప్పుడు నేను చెప్పిన విషయాలే కొన్ని ఉదాహరణ రూపంలో చెబితే మీకు మరింత బాగా అర్థం అవుతుందిరా!" అంటూ పార్థసారథి మళ్ళీ మాట్లాడసాగాడు.

"ఒరేయ్ ఉదాహరణకు..

ఒక స్త్రీ వంట చేసి వడ్డించింది అనుకోండి!

ఆమె భర్త తన పిల్లలతో పాటే టీవీ చూస్తూ తిని లేచాడు. తర్వాత టీవీలోనో.. ఫోన్ లోనో..లేదా ఆఫీస్ ఫైళ్ళలోనో లీనమయ్యాడు.

ఇక్కడ ప్రేమ ప్రకటించడమే లేదు.
ప్రేమ లేదా? అంటే ఉంది! ఆ భర్తకీ.. పిల్లలకి ఆ స్త్రీ పట్ల ప్రేమ ఉన్నా ఆ ప్రేమ ప్రకటించబడలేదు.

ఇప్పుడు మరో రకంగా చూద్దాం!

టీవీ లేకుండా పిల్లలతో మాట్లాడుతూ వంట బాగా అయ్యింది అని భార్యని మెచ్చుకున్నాడు.పిల్లలు కూడా గమనిస్తారు ఆ విషయాన్ని..క్రమంగా వాళ్ళకీ అలవాటుగా మారుతుంది.

ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లోనూ ఎక్కడ ఆనందంగా ఉంటారు ఆ కుటుంబ సభ్యులు?

నిజానికి మెచ్చుకోబడిన స్త్రీతో సహా.. మెచ్చుకున్న ఆమె భర్త,పిల్లలు కూడా ఈ రెండో సందర్బంలోనే పొందే తృప్తి ఎక్కువ.

మొదటి సందర్భంలో టీవీ వల్ల స్పృహలేని తనమే ఉంది.అక్కడ బొమ్మలుగా ఉన్నారు అంతే!

ఈ రెండో సందర్భంలో కాస్తా జీవం వచ్చింది.ఈ జీవాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు మన ఆలోచన పరిణతిని బట్టి!

పిల్లలతో కలసి ఆటలాడినట్లు కూరగాయలు తరిగి ఆమె బాధ్యత పంచుకోవచ్చు!

ఒక ఆదివారం ఆమెను కూర్చోబెట్టి పిల్లలతో కలసి వంటను ఒక ఆటలా చేసి ఆమెకు సర్వ్ చెయ్యవచ్చు!

మరోరోజున ఆమె రెండు చేతులకు పిల్లలతో కలిసి గోరెంటాకు పెట్టచ్చు!....

ఇలా ఏమైనా చెయ్యచ్చు ఈ విషయం లోనే కాదు! అన్ని విషయాల్లో కూడా! అందుకు ఉన్నతంగా ఆలోచించడమే తెలియాలి!!

కాబట్టి ప్రేమ ఉంటే సరిపోదు.అది ఎలా ప్రకటించాలో తెలియాలి.అందుకు ఆలోచనల పరిణతి కావాలి.అది తండ్రి నేర్పాలి!

ఒక గొప్ప తండ్రి పెంపకంలో పెరిగిన ఒక స్త్రీ కూడా ఈ విషయాలు కొంతవరకు తన పిల్లలకు నేర్పగలదు.అది వేరే విషయం.

ఇక తల్లి విషయం చూద్దాం!

ఆమెమొదట ప్రేమించడం నేర్పాలి!
అది మనుషులనైనా! ఆలోచనలనైనా!

ఆమె పిల్లల ముందరే భర్త గూర్చి "మీరు ఇలాంటి వారు! అలాంటి వారు!! నేనంటే ప్రేమ లేదు..నన్నసలే పట్టించుకోరు!!మీరు వేస్ట్!!!" ..ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అవి పిల్లల్లో నెగిటివ్ భావాలనే పైకి తేలేలా చేస్తాయి.

ఆమె మాట్లాడడం మాత్రమే చేయాలి!
అరవడం చేయకూడదు!!..

మనసుకు సౌమ్యంగా స్పృహతో మాట్లాడడంలో ఆకర్షణ ఉంటే.. అరవడంలో వికర్షణ ఉంటుంది.

మనుషుల్లో అసంతృప్తి పెరుగుతున్నా కొద్దీ అరవడం,గునగడం పెరుగుతూ పోతుంది.

అరవడం అంత చెడ్డది మరొకటి లేదు..
దాని వల్ల అరుస్తూ చెప్పిన విషయాలు అప్పటిమట్టుకు జరిగినా దీర్ఘకాలికంగా అది వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది.

"తొందరగా పడుకో!" అంటూ గట్టిగా అరుస్తూ పిల్లలకు చెబుతూ వెళ్ళామే అనుకో!...అప్పుటిమట్టుకు అది జరిగినా..వ్యతిరేక ధ్యానం వల్ల
తర్వాత వాళ్ళకి వయస్సు వచ్చాక తొందరగా పడుకోవడం అయిష్టంగా మారి రాత్రి 12,1 వరకు అనవసర కాలక్షేపం చేస్తూ ఉంటారు.

"లేవండీ! లేవండీ!!"..అంటూ అరుస్తూ మేల్కొల్పితే అప్పుటిమట్టుకు అది జరిగినా..వ్యతిరేక ధ్యానం వల్ల తర్వాత వయస్సు వచ్చాక పని ఏమీ లేకుంటే చాలు!!ఉదయం 10,11 వరకు లేవకుండా పడుకునే ఉంటారు!!

మనం ఏ విషయంలో అరుస్తామో తర్వాత దానికి విరుద్ధ ఫలితాలు ఏర్పడుతాయి.అంతే కాదు!ఆ క్షణంలో వాళ్ళ మనసు ఉలిక్కిపడి టెన్షన్ పడడం జరుగుతూ ఉండడం వల్ల అది కూడా నిరంతర అభ్యాస నెగిటివ్ ధ్యానమై పెరిగిన తర్వాత చిన్న చిన్న విషయాలకు కూడా టెన్షన్ పడే గుణంగా మారుతుంది!

అరవడం వల్ల స్నానం,తినడం వంటి అన్ని విషయాల్లో నిరంతర హడావుడివల్ల వాళ్ళు పెరిగిన తర్వాత అన్ని పనులు అడ్డదిడ్డంగా అసంపూర్తిగా చెయ్యడం అలవాటుగా మారుతుంది!

పరిస్థితులు ఎలా అన్నా ఉండనీ..మనసు నిండా ప్రేమ నింపుకుని కాన్సియస్ గా ప్రవర్తిస్తే చాలు! వారిని చూసి పిల్లలు ప్రేమించడం ఎలాగో నేర్చుకుంటారు!!
ముఖ్యంగా ఈ విషయంలో తల్లి పాత్ర ఎక్కువ.

మనుసు నిండా టెన్షన్,హడావుడి,గందరగోళాలతో స్పృహ లేకుండా ప్రవర్తిస్తే అది పిల్లల వ్యక్తిత్వంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది!

ఇక ఆలోచనలను ఎలా అమలు పర్చడం నేర్పాలో వివరిస్తాను! వినండి!!

పిల్లలను స్కూలుకు పంపాలన్నది ఒక ఆలోచన అనుకుందాం!

అది అమలుకు రాకముందే ఆ ఆలోచనను ప్రేమించడం నేర్పాలి! నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఏ ఆలోచనను బాగా ప్రేమిస్తామో దాన్ని మాత్రమే చక్కగా అమలు పర్చగలము!

స్కూలుకు వెళితే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో..ఎందరు క్రొత్త క్రొత్త స్నేహితులు అవుతారో.. ఎన్ని గొప్ప విషయాలు నేర్చుకోవచ్చో చెబుతూ మొదట స్కూలుకు వెళ్లే ఆలోచనను ప్రేమించేలా చెయ్యాలి!

అలా కాకుండా కొంతమంది తల్లులు "వీడి(దీని) అల్లరి భరించలేక పోతున్నాం!స్కూలుకు పంపితే సరి!!" వంటి మాటలు మాట్లాడితే ఆ పిల్లలకు "స్కూల్ అంటే ఒక జైలు లేదా తమ ఆనందాన్ని కట్టడి చేసే శిక్ష" అనే భావం నాటుకుని పోతుంది.

అలా నాటబడిన భావంతో ఆ ఆలోచన సరిగ్గా అమలుకాదు కూడా!
తర్వాత తర్వాత వాళ్ళు స్కూలుకు భారంగా వెళ్లినా సెలవులు వచ్చాయంటే ఎగిరి గంతేస్తారు!
ఇందుకు స్కూల్ విద్యా బోధన విధానం కూడా కారణమే అనుకో!

కానీ పిల్లలకు నేర్చుకోవడంలో ఉన్న ఆనందం రుచి చూపించేలా మన ప్రవర్తన ఉండాలి!

ఒకవేళ ఆ నెగిటివ్ మాటలను కూడా పాజిటివ్ పద్దతిలో " అల్లరి చేస్తే స్కూల్ కు పంపం! అక్కడ మంచి ఫ్రెండ్స్..టీచర్స్ ఉంటారు" అనేలా చెబితే కొంతవరకు పర్వాలేదు!

ఇంకా "పిల్లలు బాగా చదవాలి!" అనేది ఒక ఆలోచన లేదా కోరిక అనుకుందాం!

మొదట దాన్ని బాగా ప్రేమించేలా చెయ్యాలి!

ఆ తల్లి ..చందమామ లాంటి కథల పుస్తకాన్నో..లేదా బొమ్మల కథల పుస్తకాన్నో పట్టుకుని టీవీ వంటి వ్యాపకాల్లో ఉండకుండా అందులోని కథలు చెబుతూ..ఆ పుస్తకంలోని బొమ్మలు చూపిస్తూ చదవడాన్ని ప్రేమించేలా చెయ్యాలి!

తర్వాత తర్వాత ఆ చదవడం బాగా అమలు పర్చబడుతుంది!వాళ్ళు చదవడాన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతారు!..అంతే కాదు చదువు పూర్తి అయ్యాక కూడా ఇంకా చదువుతూనే ఉంటారు ఇష్టంగా!!

ఇలా పిల్లలు నీట్ గా ఉండే విషయంలోనూ..మంచి అభ్యాస విషయంలోనూ కాన్సియస్ గా వ్యవహరించవలసి ఉంటుంది.

..ఇలా మంచి ఆలోచనలను అమలు పరచడానికి ముందుగా..వాటిని ప్రేమించేలా చేస్తే ఖచ్చితంగా అవి అమలుపర్చబడుతాయి!

కాబట్టి మంచి ఆలోచనలు ఉంటే సరిపోదు.
అవి ఎలా అమలు పరచాలో తెలియాలి.
అందుకు ఆలోచనలను ప్రేమించడం కావాలి.
అది తల్లి నేర్పాలి!
అవసరమైతే భర్త సహకారాన్ని తీసుకోవాలి.

ఒక మంచి తల్లి పెంపకంలో పెరిగిన ఒక పురుషుడు కూడా ఈ విషయాలు కొంతవరకు తన పిల్లలకు నేర్పగలడు.అది వేరే విషయం.

మీరు గమనించి చూడండి! మీ విషయంలో మేము చేసింది అదే!

నేను ఈ గోదావరిలో ఈత కొడుతూ ఉంటే మీ అమ్మ నన్ను చూపిస్తూ "ఇలా ఈదండి! అలా ఈదండి!! అంటూ ఉత్సాహంగా మీ ముందు నాకు చెబుతూ ఉండేది!!..దాంతో మీక్కూడా ఈతపట్ల ఇష్టం ఏర్పడి తొందరగా స్విమ్మింగ్ నేర్చుకున్నారు! చదువుకునే సమయంలో చిన్నోడికి ఈతల పోటీల్లో బహుమతి కూడా వచ్చింది కదా!!

అలా కాకుండా మీ అమ్మ "లోతుకు వెళ్ళకండి! తొందరగా ఒడ్డుకు వచ్చెయ్యండి! అక్కడ సుళ్ళు ఉంటాయొచ్చు!!"అంటూ తెలిసి తెలియక తన మనసులోని భయాన్ని నెగిటివ్ మాటల ద్వారా మీ ముందు మాట్లాడి ఉంటే మీకు స్విమ్మింగ్ అన్నా..నీళ్లు అన్నా ఒక భయం ఏర్పడి ఉండేది.

అలాగే మీ అమ్మ బొమ్మల భారతం,రామాయణం చెబుతూ ఉంటే మీరు ఆసక్తిగా వింటూ ఎన్నో ప్రశ్నలు అడిగేవాళ్ళు! నేను కూడా మీతో పాటు పాల్గొని ఓపిగ్గా సమాధానాలు చెప్పేవాన్ని!! మీరు ఇప్పటికి కూడా ఖాళీ సమయం దొరికితే మంచి పుస్తకాలు చదవడంలో ఎంజాయ్ చేస్తున్నారంటే అప్పుడు చదవడం పట్ల ఏర్పడ్డ ప్రేమ,ఇష్టమే కారణం.

తల్లిదండ్రులు నెగిటివ్ భావోద్వేగాలతో..నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి పాజిటివ్ విషయాలు ఎన్ని చెప్పినా చివరికి అవి నెగిటివ్ ఫలితాలనే ముందుకు తీసుకువస్తాయి.

అది చచ్చిన ఎలుక పైన సెంట్ కొట్టడం లాంటిది! తాత్కాలికంగా కొన్ని క్షణాలు సువాసన వచ్చినా దుర్వాసన పెరిగి పోతూనే ఉంటుంది.

మీకు ఒక గొప్ప జపం చెప్పి..ఈ జపం నిష్ఠగా చెయ్యండి!చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.చక్కటి జ్ఞానం ఏర్పడి ఎంతో గొప్ప స్థితికి చేరుకుంటారు!..అంటూ ఎన్నో పాజిటివ్ విషయాలు చెప్పి చివరకు ఈ జపం చేస్తున్నప్పుడు "కోతి మాత్రం గుర్తుకు రావద్దు!!" అంటూ ఒక నెగిటివ్ విషయం చెబితే ఆ జపం చేస్తున్నంత సేపు కోతి గుర్తుకు వస్తూనే ఉంటుంది.

లాభం కలిగించడంలో పాజిటివ్ కు ఉన్న ఆకర్షణ కన్నా...నష్టం కలిగించడంలో నెగిటివ్ కు ఉన్న ఆకర్షణ ఎక్కువ..

డబ్బుకాని,పుణ్యం కానీ కొద్ది కొద్దిగా జమ చెయ్యడం క్రమంగా జరిగే ఫలితం.కానీ, వాటిని ఖర్చుపెట్టడం సులభంగా వేగంగా జరిగిపోతుంది.

కాబట్టి పిల్లల పెంపకంలో నెగిటివ్ ప్రభావాన్ని వీలైనంత తగ్గించాలి!

మీరు ఇంటికి వెళ్ళాక ఎక్కడెక్కడ నెగిటివ్ గా మీ ప్రవర్తన ఉందో చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి!ఒక పెన్నూ పేపర్ పట్టుకుని రాసుకుని తగిన విధంగా మార్పులు తెచ్చుకోండి!

ముందు మొండితనం ఉందంటున్న మీ పిల్లలని మార్చే ప్రయత్నం మానేసి మీరు మారండి! ఇతరులను మార్చడం కన్నా తనని తాను మార్చుకోవడం చాలా ఈజీ పని కూడా!"

మీరు మారుతున్నా కొద్దీ వాళ్లలో కూడా మార్పు దానికదే వస్తుంది!..తల్లీ తండ్రీ పేరెంటింగ్ విషయంలో తమ తమ బాధ్యతను గుర్తించి పిల్లల పట్ల కాన్సియస్ గా వ్యవహరించినప్పుడే సరియైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళ ప్రవర్తనలో మార్పును గమనిస్తూ మనని మనం కూడా పేరెంటింగ్ లోని లోపాలను గమనిస్తూ మార్చుకుంటూ ఉండాలి!

"స్పృహలేని తాత్కాలిక ఎమోషన్స్,అనవసర వినోద ఆపేక్షలే ఎక్కువ సమస్యలకు కారణం"

...సరే!!చీకటి పడుతోంది! ఇంటికి వెళదాం పద!! "అంటూ లేచి ఇంటివైపు నడవసాగాడు పార్థసారథి తన కొడుకులతో కలిసి అడుగులు వేస్తూ!!

"మీ కోడళ్లు కూడా ఈ మాటలన్నీ వింటే చాలా బావుండేది నాన్నా!" అన్నాడు సురేష్.. తండ్రితో పాటే అడుగులు వేస్తూ!!

"పర్వలేదురా సూరి! నాన్నతో నువ్వు సమస్య చెప్పడం ప్రారంభించగానే ఎందుకైనా మంచిదని నా ఫోన్ లో రికార్డ్ చేశానురా!నీకు వాట్సాప్ లో పంపిస్తాలే!...దీన్ని మరోసారి వాళ్ళతో కలిసి విని ఆటిట్యూడ్ ను మార్చుకోవాలి మనం!!" అన్నాడు మహేష్.

"నెగిటివ్ విషయాలు చెప్పొద్దు!అన్నారు కదా!...కానీ వాళ్ళకి లోకం పోకడ,వ్యవహార జ్ఞానం ఎలా అబ్బుతుంది నానా?"అడిగాడు మహేష్ తండ్రితో పాటు నడుస్తూనే

"మొక్కగా ఉన్నప్పుడే కంచె,రక్షణ అవసరంరా! వాళ్ళ వ్యక్తిత్వం చక్కగా రూపు దిద్దుకుని వృక్షంలా ఎదిగాక ఆ కంచె, రక్షణ అవసరం లేదు." అన్నాడు పార్థసారథి కొడుకులతో పాటు నడుస్తూనే!!


***************************

ఓపికగా చదివినవారికి
ధన్యవాదములతో

గురుమంచి రాజేంద్రశర్మ
 

Top